లభించని ఆచూకీ | Sakshi
Sakshi News home page

లభించని ఆచూకీ

Published Sat, May 25 2024 5:25 PM

-

వెంకటేశం కోసం ముమ్మరంగా గాలింపు

కల్హేర్‌(నారాయణఖేడ్‌): గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసిన మల్దోడ్డి వెంకటేశం ఆచూకీ లభించలేదు. శుక్రవారం నారాయణఖేడ్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు లు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కంగ్టీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, కల్హేర్‌ ఎస్‌ఐ వెంకటేశం, ఎస్‌బీ, స్పెషల్‌ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. కామారెడ్డి జిల్లా పెద్దకోడల్‌గల్‌ వద్ద దొరికిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వెంకటేశంను తరలించిన వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశంను జుక్కల్‌ సమీపంలో ఓ ఫాంహౌస్‌లో విడిచినట్లు డ్రైవర్‌ చెప్పిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మహారాష్ట్రలోని దెగ్లూర్‌, తదితర ప్రాంతాల్లో గాలించారు. అనుమానిత వ్యక్తికి సంబంధించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

రేషన్‌ బియ్యం పట్టివేత

గజ్వేల్‌రూరల్‌: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న ఘటన శుక్రవారం గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తుర్కపల్లి మండలం దయమండ తండాకు చెందిన వంకోదాత వెంకటేశ్‌, వంకోదాత చిన్నలు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో తీసుకెళ్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు రైడ్‌ చేసి ట్రాలీ ఆటోలో ఉన్న 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అక్రమంగా మట్టి తరలింపు

9 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న వాహనాలను సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌, కోహెడ పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. మండలంలోని కూరెళ్ల గ్రామంలోని పెద్ద చెరువు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామానికి చెందిన తిప్పారపు నవీన్‌చారి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచరం మేరకు ఘటనా స్థలానికి వెళ్లి 9 ట్రాక్టర్లతో పాటు జేసీబీలను పట్టుకున్నట్లు తెలిపారు.

ఐదుగురిపై కేసు

కొండపాక(గజ్వేల్‌): భూతగాదా విషయంలో దాడికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొండపాక మండలంలోని దోమలోనిపల్లికి చెందిన అబ్బు కనకవ్వ, మరిది అబ్బు క్రిష్ణమూర్తిలకు ఒకే శివారులో వ్యవసాయ భూమి ఉంది. అబ్బు కనకవ్వకు చెందిన వ్యవసాయ భూమిని క్రిష్ణమూర్తి కుటుంబీకులు శుక్రవారం ట్రాక్టర్‌తో దున్నుతున్నారు. మా భూమిని ఎందుకు దున్నుతున్నారని కనకవ్వ అడగడంతో మీ భూమి ఎక్కడిదంటూ బూతు మాటలు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఆమె కుమారులపై కట్టెలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు అబ్బు క్రిష్ణ మూర్తి, పిండి ఎల్లాలు, పిండి కవిత, అబ్బు యాదవ్వ, అబ్బు లింగంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిద్రలోనే డ్రైవర్‌ మృతి

చిన్నశంకరంపేట(మెదక్‌): నిద్రలోనే కంటైనర్‌ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన నార్సింగి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వల్లూర్‌ జాతీయ రహదారి పక్కన ఓ దాబా వద్ద రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్‌ మనోజ్‌కుమార్‌ (36) గురువారం రాత్రి భోజనం చేసి కంటైనర్‌లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయం చూసేసరికి మృతి చెంది ఉన్నట్లు దాబా యజమాణి బిష్‌నోమ్‌ మనిష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నట్లు ఎస్‌ఐ అహ్మద్‌ మొహినొద్దీన్‌ తెలిపారు.

చేపలు పడుతుండగా..

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

తూప్రాన్‌: చేపల వేటకు వెళ్లి వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన మండలంలోని ఘనపూర్‌ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్‌ మండలం వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామానికి చెందిన గుడ్ల శ్రీశైలం(45) గ్రామ సమీపంలోని ఘనపూర్‌ గ్రామానికి చెందిన గౌతమ్మ చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలను విద్యుత్‌ వైరు సాయంతో పడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement