ఇక ఊరువాడా బోనాల సందడి
ఆడబిడ్డల చేతులపై అందమైన ముగ్గులు
పంటలు పండాలని పూజలు
ఊపందుకున్న వ్యవసాయం పనులు
గ్రామాల్లో పండుగ వాతావరణం
ఉపందుకునే వ్యవసాయ పనులు.. ఎటూ చూసిన పచ్చని పంటలు. ఆడబిడ్డల అరచేతులపై అందమైన ముగ్గులు.. దేవుడిలాంటి భర్త దొరకాలని కోరుకునే ఆడపిల్లల ఆకాంక్షలు.. కొత్త జంటు దూరంగా.. పంటలు బాగా పండాలని.. పిల్ల జెల్లా బాగుండాలని.. ఊరువాడా చల్లంగుండాలని గ్రామ దేవతలకు భోనాల సందడి.. ఇలా ఎన్నెన్నో విశేషాలతో కూడుకున్నదే ఆషాఢమాసం.. ఈ మాసంలో పల్లెలు, పట్టణాలు బోనాలతో మార్మోగుతాయి. నెల రోజుల పాటు గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. శనివారం నుంచి ప్రారంభమైన ఆషాఢమాసం గురించి ప్రత్యేక కథనం..
బోనం.. అమ్మవారికి నైవేద్యం..
బోనం అంటే అమ్మవారి నైవేద్యం, మహిళలు వండిన అన్నంతోపాటు బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. బోనాల ఊరేగింపులో పోతరాజుల ఆటపాటలు, శివసత్తుల విన్యాసాలు, యువకుల నృత్యాలు ఆకట్టుకుంటాయి. పూర్వ కాలంలో పండుగ రోజు దుష్టశక్తులను పారదోలడానికి బోనంతో పాటు దున్నపోతును బలిచ్చే వారు. ఇప్పుడు మేకలు, గొర్రెలు, కొడిపుంజులను బలి ఇవ్వడం అనవాయితీగా మారింది.
వన భోజనాల సందడి..
గ్రామీణ ప్రాంతాల్లో వన భోజనాలు సందడి నెలకొంటుంది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుతారు. పాడి పంటలు పండి అందరూ బాగుండాలని గ్రామ దేవతల వద్ద వనభోజనాలకు వెళ్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం అక్కడే భోజనాలు వండి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వంటలు చేసి భుజిస్తారు.
అరచేతిలో అందమైన ముగ్గులు..
కొత్తగా పెళ్లయిన యువతులు ఆషాఢమాసం ప్రారంభం కాగానే తప్పనిసరిగ పుట్టింటికి వెళ్తారు. చేతులకు గోరింటాకు పెట్టి అది ఎంత బాగా పండితే వారి జీవితం అంత బాగుంటుందని, సుఖ కాంతులో వర్ధిలుతారని నమ్మకం. గతంలో గ్రామాల్లో ప్రకృతి పరంగా గోరింటాకు పెట్టుకునేవారు. కాలక్రమేణా గోరింటాకు కనుమరుగై దాని స్థానంలో మోహిందీ వాడటం ప్రారంభమైంది.
అత్తా కోడళ్లకు ఎడబాటు..
ఆషాఢ మాసంలో అత్తత్తాకోడళ్లు ఒకరి ముఖం మరొకరు చూసుకోవద్దని తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ కారణంగా కొత్త కోడళ్లు అత్తవారింటికి దూరమవుతారు. ఆషాఢ మాసం ప్రారంభానికి ముందే కోడళ్లు తమ పుట్టింటికి చేరుకుంటారు. ఇలా దూరంగా ఉండటం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని పెద్దలు చెబుతుంటారు.
ఎవుసం పనులకు ఊపు..
ఆషాఢమాసం ప్రారంభానికల్లా రైతులు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం వంటి వ్యవసాయ పనులన్నీ పూర్తి చేస్తారు. తొలకరి జల్లులు కురవగానే వ్యవసాయ పనులను వేగవంతం చేస్తారు. ఈ మాసం ముగిసే వరకు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతారు. ఎక్కువగా వరి సాగు పనులు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment