500 క్వింటాళ్లు మహారాష్ట్రకు తరలింపు
కల్హేర్(నారాయణఖేడ్): అక్రమంగా మహారాష్ట్రకు పక్కదారి పట్టిస్తున్న భారీ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కల్హేర్ ఎస్‌ఐ వెంకటేశం కథనం మేరకు.. సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవే మీదుగా లారీల్లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందింది. కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తా సమీపంలో తనిఖీలు నిర్వహించి రెండు లారీల్లో బియ్య గుర్తించాం. మహారాష్ట్రలోని నాందేడ్‌కు బియ్యం తీసుకెళ్తున్నట్టు డైవర్లు తెలిపారు. కంగ్టీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించడంతో సివిల్ సప్లయ్ డీటీ విజయలక్ష్మి, మహేశ్, ఆర్‌ఐ మల్లేశం వచ్చి బియ్యాన్ని పరిశీలించారు. రెండు లారీలు, బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం నారాయణఖేడ్ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. కల్హేర్ తహసీల్దార్ శివ శ్రీనివాస్ బియ్యం తూకం పరిశీలించారు. సివిల్ సప్లయ్ అధికారుల ఫిర్యాదు మేరకు లారీ యజమానులు అయూబ్ అలీ, మీర్జా, డ్రైవర్లు ఖాజమియా, జుల్ఫీఖర్‌పై కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకటేశం తెలిపారు.
కూచారం శివారులో 300 క్వింటాళ్లు
మనోహరాబాద్(తూప్రాన్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను లారీలో శ్రీశైలం రోడ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నాం. రెవెన్యూ ఆర్‌ఐ దీక్షిత్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ షేక్ షోయబ్, లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి లారీని తూప్రాన్‌లోని గోదాముకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఓ ఇంట్లో 25.70 క్వింటాళ్లు నిల్వ
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలో గల శ్రీనివాస్ నివాస గృహంలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పండరినాథ్ ఆధ్వర్యంలో దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన 25.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం ఎస్‌ఐ నారాయణగౌడ్‌కు సమాచారం అందించి బియ్యం వ్యాపారి శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగింత
లారీ యజమానులు, డ్రైవర్లపై కేసు
భారీగా రేషన్ బియ్యం పట్టివేత