జహీరాబాద్ టౌన్: మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల చెరకు రెండవ పంట నుంచి అధిక దిగుబడులు సాధించవచ్చు. మోడెం తోటల విషయంలో రైతులు శ్రద్ధ చూపకపోవడం మూలంగా దిగుబడులు పడి పోతున్నాయి. రెండో పంటలో రైతులకు పెట్టుబడి ఖర్చు తక్కువ. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఫస్ట్ క్రాప్ కంటే రెండో పంటలో అధిక దిగుబడులను సాధించని వ్యవసాయ శాఖ జహీరాబాద్ డివిజన్ ఏడీఏ భిక్షపతి పేర్కొన్నారు. నాణ్యమైన దిగుబడులు పొందాలంటే సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆయన సూచించారు.
జహీరాబాద్ ప్రాంత నేలలు చెరకు పంట సాగుకు అనుకూలం. సుమారు 10 వేల మంది రైతులు దాదాపు 20 వేల ఎకరాల్లో ప్రతీ సంవత్సరం సాగు చేస్తుంటారు. జహీరాబాద్‌తోపాటు జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్ తదితర నియోజకవర్గాల్లో కూడా రైతులు చెరకు సాగు చేస్తున్నారు. ఫస్ట్ క్రాప్ (మొక్కతోటలు) నరికిన తర్వాత రెండో పంటను మోడం అంటారు. ప్రస్తుతం చెరకు సీజన్ ముగియడంతో రైతులు రెండో పంట సాగుపై దృష్టి పెట్టారు.
యాజమాన్య పద్ధతులు
● చెరకు పంటను నరికిన వెంటనే మోడులను భూమికి సమాంతరంగా నరికి వేయాలి. పిలకలు భూమి లోపల నుంచి వచ్చి బలీయంగా ఎదిగి వస్తాయి. అధికంగా పిలకలు వచ్చి పంట దిగుబడులు పెరిగేందుకు దోహదపడుతుంది.
● చెత్తను కాల్చి వేయకుండా ఆకులు కుళ్లినట్లు చేస్తే సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా ఎకరానికి 3 నుంచి 4 టన్నుల మేర సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది.
● తోట నరికిన వెంటనే నీటి తడులు ఇచ్చిన తర్వాత అదును చూసుకొని బొదెను నాగిలితో రెండు పక్కల దున్నాలి. ఇలా దున్నిన సాళ్లలో యూరియా రెండు బస్తాలు, ఎస్‌ఎస్‌పీ నాలుగు బస్తాలు, ఎంఓపీ ఒక బస్తా వంతున కలిపి వేయాలి. తర్వాత పక్కన నాగలితో దున్నినట్లయితే ఎరువు పూర్తిగా కప్పబడి చెరకు పంట ఏపుగా పెరుగుతుంది.
● బోదెను చీల్చడం ద్వార పాత వేరు తెగి కొత్త వేర్లు అభివృద్ధి చెందుతాయి. ఈ కొత్త వేర్లు చురుకుగా ఉండి భూమిలోని పోషకాలను, నీటిని, గాలిని గ్రహించి వాటికి శక్తి పెరుగుతుంది.
● తోటలో దున్నడం ద్వారా వేర్లకు కావాల్సిన గాలి అంది మొక్క వృద్ధి చెందడంతోపాటు పిలకలు అధికంగా వచ్చే అవకాశముంది.
● మోడెంలో మొక్కలకు మొక్కలకు మధ్య రెండు నుంచి మూడు అడుగుల ఖాళీలు ఉన్నట్లయితే నింపడం వల్ల పంట నాణ్యత పెరుగుతుంది.
● మోడెం తోటలలో రైతులు బోదెలను దున్నిన వెంటనే మట్టిని మోదులపైకి ఎగ దోస్తున్నారు. దీని వల్ల పిలకల శాతం గణనీయంగా తగ్గి పంట దిగుబడులు పడి పోయే ప్రమాదముంది. మోడులపైకి రెండు నెలల వరకు మట్టిని ఎగతీయకుండా చూడాలి. రెండో పంటలో ఫస్ట్ క్రాంప్ తోట కంటే ఒకటిన్నర శాతం ఎక్కువ నత్రజని వాడాలి. ఇలా యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి పెరుగుతుందని ఏడీఏ వివరించారు.
మెలకువలతో అధిక దిగుబడులు
చెరకు చెత్తతో పంటకు లాభం
జహీరాబాద్ డివిజన్ ఏడీఏ భిక్షపతి
రెండవ పంటలో యాజమాన్య పద్ధతులు