టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన సొంత జట్టు ముంబైకు గుడ్‌బై చెప్పనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌కు అంతగా అవకాశాలు లభించడం లేదు. దీంతో వచ్చే దేశేవాళీ సీజన్ నుంచి గోవా తరపున ఆడేందుకు అర్జున్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
కాగా అర్జున్ ఇప్పటి వరకు ముంబై తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ--2021లో భాగంగా హర్యానా, పుదుచ్చేరి మ్యాచ్‌ల్లో అర్జున్ ముంబై జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో గత రెండు సీజన్ల నుంచి ముంబై జట్టులో అర్జున్ సభ్యునిగా ఉన్నప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. కాగా ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో చోటుదక్కక పోవడంతోనే అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే విషయంపై టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. "అర్జున్ తన కెరీర్ మెరుగుపరుచుకోవాలంటే ఎక్కువ సమయం గ్రౌండ్‌లో గడపడం చాలా ముఖ్యం. అర్జున్ గోవా జట్టు తరపున ఆడితే అతడికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఈ మార్పు అతడి క్రికెట్ కెరీర్‌లో కొత్త దశ" అని ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందించింది.
గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లోట్లికర్ మాట్లడుతూ.. "మేము ప్రస్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల కోసం ఎదురు చూస్తున్నాము. అర్జున్ టెండూల్కర్ గోవా జట్టులో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీ-సీజన్ ట్రయల్-మ్యాచ్‌లు ముందు మేము నిర్వహిస్తాం. అతడి ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేస్తారు" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: WI vs NZ: హెట్‌మైర్ అద్భుత విన్యాసం.. క్యాచ్ ఆఫ్‌ది సీజన్!
Comments
Please login to add a commentAdd a comment