యాషెస్ సిరీస్-2023లో భాగంగా లీడ్స్ వేదికగా నిన్న (జులై 6) మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మెరుపు సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్ష్ సూపర్ సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్ వచ్చీ రాగానే సెంచరీతో విరుచుకుపడి ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 118 బంతులను ఎదుర్కొన్న మార్ష్.. 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మార్ష్ మినహా మిగతావారెవ్వరూ కనీస పరుగులు కూడా చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్ (39), స్టీవ్ స్మిత్ (22), లబూషేన్ (21), ఉస్మాన్ ఖ్వాజా (13), టాడ్ మర్ఫీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు సింగిల్ డిజిల్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌ను మార్క్ వుడ్ (5/34) నిలువునా కూల్చాడు. మార్క్ వుడ్ సైతం దాదాపు ఏడాది తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చి, చెలరేగిపోయాడు. అతనికి క్రిస్ వోక్స్ (3/73), స్టువర్ట్ బ్రాడ్ (2/58) సహకరించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను పాట్ కమిన్స్ (2/28), మార్ష్ (1/9) దెబ్బకొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 195 పరుగులు వెనుకపడి ఉంది. రూట్ (19), బెయిర్‌స్టో (1) క్రీజ్‌లో ఉన్నారు.
యాషెస్ సిరీస్ అంటే మార్ష్‌కు పూనకం వస్తుంది.. చెలరేగిపోతాడు..!
దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మార్ష్‌కు యాషెస్ సిరీస్ అంటే పూనకం వస్తుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. యాషెస్‌లో అతను ఆడిన చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 3 సెంచరీలు (118, 24, 17, 101, 29*, 9, 181) చేశాడు. 33 టెస్ట్‌ల కెరీర్‌లో తాను సాధించిన 3 శతకాలు యాషెస్‌లో సాధించినవే కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీతో కదం తొక్కిన మార్ష్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలి రోజు తాను వేసిన 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమై జాక్ క్రాలే (33) వికెట్ పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment