
మాంచెస్టర్: ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్‌నైట్ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
పట్టుదలగా ఆడిన మార్నస్ లబుషేన్ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ మార్ష్ (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్’ను నిలబెట్టుకుంటుంది.