మాంచెస్టర్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 19) ప్రారంభం కానున్న నాలుగో యాషెస్ టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా, ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్‌లను ఎంపిక చేసుకున్న ఆసీస్ మేనేజ్‌మెంట్.. స్పెషలిస్ట్ పేసర్లుగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లను బరిలోకి దించుతుంది.
మూడో టెస్ట్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా టాడ్ మర్ఫీ బరిలో నిలువగా.. నాలుగో టెస్ట్‌కు ప్రకటించిన తుది జట్టులో అతనికి చోటు లభించలేదు. మర్ఫీ స్థానంలో గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న కెమరూన్ గ్రీన్ తుది జట్టులోకి రాగా.. మూడో టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపని స్కాట్ బోలండ్ స్థానాన్ని హాజిల్‌వుడ్ భర్తీ చేశాడు. మూడో టెస్ట్ ఆడిన జట్టులో ఆసీస్ ఈ రెండు మార్పులు చేసింది.
గత మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై కెప్టెన్ కమిన్స్ సహా మేనేజ్‌మెంట్ కూడా నమ్మకముంచింది. మాంచెస్టర్ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించదని భావించిన ఆసీస్.. ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగుతూ పెద్ద సాహసమే చేస్తుంది. పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, లబూషేన్ సేవలను వినియోగించుకోవాలని ఆసీస్ యాజమాన్యం భావిస్తుంది.
మరోవైపు ఇంగ్లండ్.. ఆసీస్ కంటే ముందే తమ తుది జట్టును ప్రకటించింది. మూడో టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించిన ఇంగ్లండ్.. కేవలం ఒక్క మార్పు చేసింది. గాయం కారణంగా మూడో టెస్ట్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు.
ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది.
ఇంగ్లండ్: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment