T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన | Australia T20I Series Against Afghanistan Postponed Due To This Reason | Sakshi
Sakshi News home page

T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన

Mar 19 2024 1:41 PM | Updated on Mar 19 2024 3:44 PM

Australia T20I Series Against Afghanistan Postponed Due To This Reason - Sakshi

ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఇందుకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా ఐసీసీ ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఏడాది ఆగష్టులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా ఆసీస్‌- అఫ్గన్‌ మధ్య సిరీస్‌ జరగాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌లో పరిస్థితుల దృష్ట్యా యూఏఈలో అఫ్గన్‌ ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది.

కారణం ఇదే
ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్‌ ప్రభుత్వం మహిళలు, బాలికల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందన్న కారణంతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా 2021లోనూ సీఏ ఇదే కారణంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టును రద్దు చేసింది. అఫ్గనిస్తాన్‌లో రోజురోజుకూ బాలికలు, మహిళల పరిస్థితి దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. 

కాగా అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు హైస్కూల్‌కు వెళ్లకుండా, మహిళలు ఉన్నత విద్యనభ్యసించకుండా, ఉద్యోగాలు చేయకుండా కఠిన నిబంధనలు విధించిందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన అండర్‌-19 వుమెన్‌ టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు ఫుల్‌ మెంబర్‌ జట్లలో అఫ్గనిస్తాన్‌(మహిళలు క్రికెట్‌ ఆడకూడదనే నిబంధన) ఒక్కటే హాజరు కాలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించామన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

చివరగా అప్పుడే
కాగా చివరగా వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ తలపడ్డాయి. ఇందులో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి సీఈఓ గాఫ్‌ అలార్డిస్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఫుల్‌ మెంబర్‌కు తాము మద్దతుగా నిలవకతప్పదని పేర్కొన్నారు.

చదవండి: Rohit Sharma: రోహిత్‌ క్రీజులో ఉన్నంతవరకే ముంబైకి మా మద్దతు! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement