ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ బ్యాటర్ అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండుల్కర్. పదహారేళ్ల వయసులో.. 1989లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ‘మాస్టర్ బ్లాస్టర్’ 2013లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఇరవై నాలుగేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు లెక్కకుమిక్కిలి ఘనతలు సాధించిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా వంద సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న ఈ లెజెండ్.. అత్యధిక పరుగుల వీరుడిగానూ చెక్కు చెదరని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీటితో పాటు మరెన్నో అరుదైన ఫీట్లు నమోదు చేసి అత్యుత్తమ క్రికెటర్‌గా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు.
అయితే, ఆస్ట్రేలియన్లు మాత్రం వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారానే సచిన్ కంటే మెరుగైన ఆటగాడని భావిస్తారట. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ అలీ బచర్ ఈ మాట అంటున్నాడు. అయితే, తన దృష్టిలో మాత్రం సచిన్.. లారా కంటే ఎంతో గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా అని పేర్కొన్నాడు.
అందుకే సచిన్ గొప్ప బ్యాటర్ అంటాను
ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘సచిన్ టెండుల్కర్ అసాధారణ ఆటగాడు. అందరిలా కాకుండా.. అతడు వేరొక గ్రహం నుంచి వచ్చాడనే అనుకుంటా. అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ఎన్నో చూశాను.
అయితే, వాటన్నింటి కంటే కూడా వ్యక్తిగా అతడు మిగత వారి కంటే ఎంతో ఉత్తముడు. అతడు మైదానంలోపల లేదంటే వెలుపల.. ఎవరితోనైనా వాదనకు దిగడం చూశారా? నేనైతే ఎప్పుడూ అలాంటివి చూడలేదు.
అందుకే అతడు మిగతా వాళ్లకంటే గొప్పవాడు. ఆనందజీవి అని చెబుతాను. మీకు తెలుసా.. ఆస్ట్రేలియన్లు సచిన్ కంటే లారా బెటర్ అని భావిస్తారు. నేనైతే ఆ మాటను రబ్బిష్ అని కొట్టిపారేస్తా.
బ్రియన్ లారా నాలుగు మిలియన్ల మంది ముందు ఆడితే.. ఈ మనిషి(సచిన్‌ను ఉద్దేశించి) 1.4 బిలియన్ల మంది కోసం ఆడాడు. అలాంటపుడు అతడిపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? అదీ అతడి గొప్పతనం’’ అని అలీ బచర్.. సచిన్ టెండుల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా అలీ సౌతాఫ్రికా తరఫున పన్నెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.
పరుగుల వీరుడు సచిన్ టెండుల్కర్
అంతర్జాతీయ కెరీర్ సచిన్ టెండుల్కర్ టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 18426 రన్స్ తీశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.
చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?
Comments
Please login to add a commentAdd a comment