భార్యాపిల్లలతో వార్నర్
India vs Australia Test Series: ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఇప్పటికే ఆరుగురు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. టీమిండియాతో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా రాణించాలని ఉవ్విళ్లూరుతున్న వేళ వ్యక్తిగత కారణాలు, గాయాల బెడద వల్ల వీరు జట్టుకు దూరమయ్యారు.
మిచెల్ స్వెప్సన్ తన తొలి సంతానాన్ని చూసుకునేందుకు స్వదేశానికి వెళ్లిపోగా.. జోష్ హాజిల్‌వుడ్ మడిమ నొప్పి, వార్నర్ మోచేతి గాయం, మ్యాట్ రెన్షా మోకాలి గాయంతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. ఇక తొలి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం రాని అష్టన్ అగర్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించడానికి.. ప్యాట్ కమిన్స్ తన కుటుంబం కోసం సొంత దేశానికి చేరుకున్నారు.
వార్నర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఇక తన తల్లి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడని కారణంగా కెప్టెన్ కమిన్స్ మూడో టెస్టుకు దూరం కానుండగా.. స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో విఫలమై జట్టుకు దూరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎమోషనల్ పోస్టుతో అభిమానుల ముందుకు వచ్చాడు.
ఎంతో బాధగా ఉంది
‘‘గాయం కారణంగా జట్టును వీడటం ఎంతో బాధగా ఉంది. ఇలాంటి చేదు జ్ఞాపకాలను నేను కోరుకోలేదు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు. ఢిల్లీ మ్యాచ్ మేము అనుకున్నట్లుగా సాగలేదు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో జట్టు పుంజుకుని మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా’’ అంటూ వార్నర్ ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా టీమిండియాతో నాగ్‌పూర్ టెస్టులో 11 పరుగులు చేసిన వార్నర్.. రెండో టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఢిల్లీ టెస్టు మధ్యలోనే మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. తర్వాత భార్యాపిల్లలతో కలిసి హుమాయున్ సమాధి దర్శించిన వార్నర్ తిరిగి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఈ మేరకు ఇన్‌స్టాలో తన ఫొటోలు పంచుకుంటూ తనకు అండగా నిలిచిన అభిమానుల పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఇక టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో వార్నర్‌కు స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023కి రిషభ్ పంత్ గైర్హాజరీ నేపథ్యంలో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: అద్భుతం ఆవిష్కృతమైన వేళ.. నాటి వీడియో చూశారా? సచిన్ వీర విహారం..
Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్..
Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే!
Comments
Please login to add a commentAdd a comment