39/6.. ఓటమి కొరల్లో చిక్కుకున్న జట్టును గెలిపించిన బాబర్‌ ఆజమ్‌ | BPL 2024: Babar Azam Unbeaten Half Century Made Rangpur Riders Win Against Sylhet Strikers | Sakshi
Sakshi News home page

39/6.. ఓటమి కొరల్లో చిక్కుకున్న జట్టును గెలిపించిన బాబర్‌ ఆజమ్‌

Published Tue, Jan 23 2024 5:24 PM | Last Updated on Tue, Jan 23 2024 6:14 PM

BPL 2024: Babar Azam Unbeaten Half Century Made Rangpur Riders Win Against Sylhet Strikers - Sakshi

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (49 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓటమి కొరల్లో చిక్కుకున్న తన జట్టును టెయిలెండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (35 బంతుల్లో 47 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సాయంతో విజయతీరాలకు చేర్చాడు. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న రంగ్‌పూర్‌ రైడర్స్‌ను బాబర్‌-ఒమర్‌జాయ్‌ జోడీ అజేయమైన 86 పరుగులు జోడించి 4 వికెట్ల తేడాతో గెలిపించింది. 

బీపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో సిల్హెట్‌ స్ట్రయికర్స్‌, రంగ్‌పూర్‌ రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్ట్రయికర్స్‌.. రిపన్‌ మొండల్‌ (2/19), మెహిది హసన్‌ (2/18), మొహమ్మద్‌ నబీ (1/17), హసన్‌ మురద్‌ (1/29) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్ట్రయికర్స్‌ ఇన్నింగ్స్‌లో హోవెల్‌ (43), కట్టింగ్‌ (31), షాంటో (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

ఛేదనలో బాబర్‌ ఆజమ్‌ జట్టు రంగ్‌పైర్‌ రైడర్స్‌ కూడా తడబడింది. దుషన్‌ హేమంత ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో (39/6) పడింది. అయితే బాబర్‌.. ఒమర్‌జాయ్‌ సహకారంతో రైడర్స్‌కు అపురూప విజయాన్ని అందించాడు. మరో వికెట్‌ పడకుండా ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడి 18.2 ఓవర్లలో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. రైడర్స్‌ జట్టులో ముగ్గురు డకౌట్లు కాగా.. రోనీ తాలుక్‌దార్‌ 6, నురుల్‌ హసన్‌ 8, షమీమ్‌ హొసేన్‌ 2 పరుగులు చేశారు. స్ట్రయికర్స్‌ బౌలర్లలో హేమంత 3, నగరవ, తంజిమ్‌ సకీబ్‌, నజ్ముల్‌ ఇస్లాం తలో వికెట​ పడగొట్టారు. 

చదవండి: ఫలితాలు పట్టించుకోం.. బాబర్‌ గెలిపించలేకపోయాడు: షాహిన్‌ ఆఫ్రిది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement