జలజ్ సక్సేనా (పాత ఫొటో)
Duleep Trophy 2023: అద్భుతంగా రాణించినప్పటికీ తనకు దులిప్ ట్రోఫీ టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించకపోవడంపై కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘోరం ఎప్పుడైనా జరిగిందా అంటూ సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు.
తానెవరినీ తప్పుబట్టడం లేదని, అయితే.. తనను ప్రతిష్టాత్మక ట్రోఫీ ఆడే జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పగలరా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2022-23 రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో కేరళ తరఫున వెటరన్ ఆల్‌రౌండర్ జలజ్ ఏడు మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు పడగొట్టాడు.
వాషింగ్టన్ సుందర్ కోసం?
బ్యాట్‌తోనూ రాణించి కేరళ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, దులిప్ ట్రోఫీ ఆడే క్రమంలో సౌత్ జోన్ జట్టును ఎంపిక చేసే క్రమంలో 36 ఏళ్ల జలజ్‌ను సెలక్టర్లు విస్మరించారు. తమిళనాడు ఆల్‌రౌండర్, టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు చోటు కల్పించేందుకు ఈ కేరళ ప్లేయర్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తనకు జట్టులో స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేని జలజ్ సక్సేనా ట్విటర్ వేదికగా ఆవేదనను పంచుకున్నాడు. ‘‘భారత్‌లో రంజీ ట్రోఫీ(ఎలైట్ గ్రూప్) టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిని దులిప్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేయలేదు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా?
చరిత్రను తిరగేయండి
దయచేసి.. నాకోసం ఒక్కసారి చరిత్రను తిరగేయండి! కేవలం ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంతే! ఎవరినీ నిందించే ఉద్దేశం నాకైతే లేదు’’ అంటూ జలజ్ ఆవేదనభరిత ట్వీట్ చేశాడు. కాగా దులిప్ ట్రోఫీ సౌత్ జోన్ సెలక్షన్ విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జలజ్‌తో పాటు తమిళనాడు ప్లేయర్ బాబా ఇంద్రజిత్‌ను కూడా పక్కనపెట్టడంతో సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఈ విషయంపై స్పందిస్తూ.. సెలక్షన్ కమిటీ అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు.
రెస్టాఫ్ ఇండియాకు ఆడిన బాబా ఇంద్రజిత్‌ను ఎందుకు ఎంపికచేయలేదో ఎవరైనా చెప్పగలరా అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు. సెలక్టర్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా అర్థమవుతోందా అంటూ ఫైర్ అయ్యారు. కాగా బెంగళూరు వేదికగా జూన్ 28 నుంచి దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. జూలై 12-16 వరకు ఫైనల్ జరుగనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్, సౌత్ జోన్ల జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి.
చదవండి: Ind vs WI: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్!
ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్‌లో ఇరు జట్లు
Highest wicket taker in Ranji trophy in India( Elite Group) didn't get picked in Duleep trophy. Can you please check whether it has ever happened in the Indian Domestic history? Just wanted to know. Not blaming anyone 🙏 https://t.co/Koewj6ekRt
— Jalaj Saxena (@jalajsaxena33) June 17, 2023
Comments
Please login to add a commentAdd a comment