Venkatesh Prasad Takes A Dig At Selectors For Excluding Jalaj Saxena For Duleep Trophy 2023 - Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!

Published Mon, Jun 19 2023 1:53 PM | Last Updated on Mon, Jun 19 2023 3:00 PM

Venkatesh Prasad Takes A Dig At Selectors For Excluding Jalaj Saxena - Sakshi

టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్‌ స్పిన్నర్‌ జలజ్‌ సక్సేనాను సౌత్‌ జోన్‌ తరఫున దులీప్‌ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్‌, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్‌ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు.

జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్‌ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు.

ఈ విషయాలను ఇండియన్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌ ఫోరమ్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. బీసీసీఐ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ అయిన వెంకటేశ్‌ ప్రసాద్‌ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్‌ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు.

కాగా, 36 ఏళ్ల జలజ్‌ సక్సేనా 2022-23 రంజీ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో ఇతనే లీడింగ్‌ వికెట్‌టేకర్‌. ఓవరాల్‌గా జలజ్‌ తన దేశవాలీ కెరీర్‌లో 133 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 104 లిస్ట్‌-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్‌ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున కూడా ఓ మ్యాచ్‌ ఆడాడు. 

ఇదిలా ఉంటే, దులీప్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్‌ జోన్‌ జట్టుపై టీమిండియా వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్‌ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్‌ జోన్‌ సెలెక్టర్లను నిలదీశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement