Photo Credit: IPL Twitter
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది.
భారీ రికార్డుపై కన్నేసిన చహల్..
పంజాబ్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్‌లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్‌లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్‌లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్‌ఆర్‌హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment