టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో ఆల్‌టైమ్ రికార్డుకు చేరువవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన అతను.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు (212) చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో కోహ్లి సౌతాఫ్రికా లెజెండ్ జాక్ కలిస్ (211) రికార్డును అధిగమించాడు.
ఈ జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (264) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (217), శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (216) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కోహ్లి మరో 53 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేస్తే సచిన్ ఆల్‌టైమ్ రికార్డును అధిగమిస్తాడు.
ఇదిలా ఉంటే, నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
కోహ్లి ఖాతాలో మరిన్ని రికార్డులు..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన కోహ్లి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 48వ సెంచరీని, ఓవరాల్‌గా (అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో) 78వ సెంచరీని నమోదు చేసిన కోహ్లి.. తాజాగా చేసిన 103 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో 26000 పరుగుల మైలురాయిని (26026 పరుగులు) దాటాడు. గతంలో ఈ మైలురాయిని సచిన్ (34357), సంగక్కర (28016), పాంటింగ్ (27483) మాత్రమే దాటారు.
26000 పరుగుల మార్కును చేరుకునే క్రమంలో కోహ్లి.. జయవర్ధనేను (25957) అధిగమించాడు. 26000 పరుగుల మైలురాయిని కోహ్లి అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (567) చేరుకోవడం విశేషం. కొద్ది రోజుల కిందట కోహ్లి అత్యంత వేగంగా 25000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment