కోహ్లి సెంచరీకి సాయపడ్డ అంపైర్‌.. క్లియర్‌ వైడ్‌బాల్‌ ఇవ్వకుండా..! | CWC 2023, IND VS BAN: Umpire Does Not Give Wide When Kohli Is Closer To Century | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS BAN: కోహ్లి సెంచరీకి సాయపడ్డ అంపైర్‌.. క్లియర్‌ వైడ్‌బాల్‌ ఇవ్వకుండా..!

Published Fri, Oct 20 2023 11:12 AM | Last Updated on Fri, Oct 20 2023 11:22 AM

CWC 2023 IND VS BAN: Umpire Does Not Give Wide When Kohli Is Closer To Century - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.​

అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన సెంచరీ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీకి అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో సాయపడ్డాడని కోహ్లి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కోహ్లి 97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉండగా బంగ్లా బౌలర్‌ నసుమ్‌ అహ్మద్‌ లైగ్‌ సైడ్‌ దిశగా వైడ్‌బాల్‌ వేశాడు. ఏ తరహా క్రికెట్‌లో అయినా దీన్ని వైడ్‌బాల్‌ కాదనే వారు ఉండరు.

అయితే, కెటిల్‌బొరో ఈ బంతిని వైడ్‌బాల్‌గా ప్రకటించకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. బంతి లెగ్‌ సైడ్‌ దిశగా వెళ్లగానే కోహ్లి అంపైర్‌ వైపు దీనంగా చూశాడు. దీనికి అంపైర్‌ చలించిపోయాడో ఏమో కాని, మొత్తానికి వైడ్‌ ఇవ్వకుండా కోహ్లి సెంచరీకి పరోక్షంగా తోడ్పడ్డాడు. అనంతరం ఓ బంతిని వృధా చేసిన కోహ్లి, 42వ ఓవర్‌ మూడో బంతికి సిక్సర్‌ బాది సెంచరీ పూర్తి చేశాడు.

కోహ్లి సెంచరీ మాట అటుంచితే, అతను సెంచరీ మార్కును చేరుకున్న వైనాన్ని జనాలు తప్పుపడుతున్నారు. అంతకుముందు ఓవర్లో కూడా కోహ్లి 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాహుల్‌ సింగిల్‌కు పిలుపునివ్వగా నిరాకరించి వ్యతిరేకులకు టార్గెట్‌గా మారాడు. వ్యక్తిగత మైలురాళ్లకు కోహ్లి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ఈ ఒక్క ఇన్నింగ్స్‌ చూస్తే అర్ధమవుతుందని కోహ్లి వ్యతిరేకులు సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement