ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగు వరుస విజయాల తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఒక్కసారిగా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్ 1) జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన కివీస్ రన్‌రేట్ పరంగానూ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఇవి చాలవన్నట్లు ఆ జట్టులో గాయాల సమస్య మరింత తీవ్రతరమైంది. సౌతాఫ్రికాతో సందర్భంగా ఆ జట్టు స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురై ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. జట్టు ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు అతను ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. గాయం తాలూకా వేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.
హెన్రీ గాయం తీవ్రతపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ.. అతను కనీసం ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కివీస్‌కు హెన్రీ గాయం విషయం అస్సలు మింగుడుపడటం లేదు. గాయాల కారణంగా ఇప్పటికే కేన్ విలియమ్సన్, లోకీ ఫెర్గూసన్, మార్క్ చాప్‌మన్ సేవలు కోల్పోయిన కివీస్.. తాజాగా మ్యాట్ హెన్రీ సేవలు కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది.
సెమీస్ రేసులో నిలవాలంటే కివీస్ మున్ముందు అత్యంత కీలకమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాల బారిన పడుతుండటం ఆ జట్టుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సౌతాఫ్రికా మ్యాచ్ సందర్భంగా హెన్రీతో పాటు జిమ్మీ నీషమ్ కూడా గాయపడినట్లు సమాచారం. నీషమ్ కుడి చేతి మణికట్టుకు గాయమైనట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమై, అతను తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోతే కివీస్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (114), డస్సెన్ (133) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. కేశవ్ మహారాజ్ (4/46), మార్కో జన్సెన్ (3/31), కొయెట్జీ (2/41), రబాడ (1/16) ధాటికి 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment