ఆసీస్‌పై అద్భుత విజయం.. అయినా ఐదో స్థానంలో టీమిండియా | Cricket World Cup 2023: Updated Points Table After ICC ODI WC Match Between India And Australia - Sakshi
Sakshi News home page

CWC 2023 Updated Points Table: ఆసీస్‌పై అద్భుత విజయం.. అయినా ఐదో స్థానంలో టీమిండియా

Published Mon, Oct 9 2023 12:19 PM | Last Updated on Mon, Oct 9 2023 12:44 PM

CWC 2023: Points Table After India, Australia Match - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 భాగంగా ఆసీస్‌తో నిన్న జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలవడంతో టీమిండియా వరల్డ్‌కప్‌ పాయింట్ల పట్టికలో ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే నిదానంగా ఆడటం​ కారణంగా భారత్‌ మెరుగైన రన్‌రేట్‌ను సాధించలేక, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో 41.2 ఓవర్లో విజయం సాధించిన భారత్‌.. కేవలం 0.883 రన్‌రేట్‌ సాధించి, ఇప్పటివరకు గెలుపొందిన జట్ల జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. భారత్‌ చేతిలో ఓడిన ఆసీస్‌ ఆరో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ చేతుల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్‌, నెదర్లాండ్స్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు వరుసగా 7 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి.

ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లో బంపర్‌ విక్టరీ సాధించిన న్యూజిలాండ్‌ 2.149 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. భారీ స్కోర్‌ చేసి శ్రీలంకను మట్టికరిపించిన సౌతాఫ్రికా 2.040 రన్‌రేట్‌తో రెండో ప్లేస్‌లో ఉంది. నెదర్లాండ్స్‌పై ఓ మోస్తరు విజయం సాధించిన పాక్‌ 1.620 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌ 1.438 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి అన్ని జట్లు చెరో మ్యాచ్‌ మాత్రమే ఆడాయి. లీగ్‌ దశలో ప్రతి జట్టు ఇంకా తలో 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

కాగా, ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-0-42-2), అశ్విన్‌ (10-1-34-1), సిరాజ్‌ (6.3-1-26-1), హార్దిక్‌ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్‌ కాగా.. కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), రాహుల్‌ (115 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు)ల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సాయంతో భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 3, స్టార్క్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌, ఇషాన్‌లతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ డకౌట్లయ్యారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్‌ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement