బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ ప్రవేశపెట్టిన తొలి ఎడిషన్‌లోనే హర్మన్ నేతృత్వంలోని టీమిండియా పతకం ఖరారు చేసింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో టీమిండియా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు అర్ధసెంచరీ (32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు), మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 164 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో షఫాలీ వర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (20 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఇంగ్లీష్ బౌలర్లలో కెంప్ 2, బ్రంట్, సీవర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి లక్ష్యం దిశగా సాగింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నతాలీ సీవర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, సిక్స్) రనౌటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్‌వైపు మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావల్సిన తరుణంలో స్నేహ్ రాణా (2/28) అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. ఈ విజయంతో కామన్‌వెల్త్ క్రీడల క్రికెట్‌లో భారత్‌కు తొలి పతకం (కనీసం రజతం) ఖరారైంది. ఇంతకుముందు 1998 కామన్‌వెల్త్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో భారత్ కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోయిన విషయం తెలిసిందే.
చదవండి: అదరగొడుతున్న అథ్లెట్లు.. స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లేకు రజతం
Comments
Please login to add a commentAdd a comment