photo courtesy: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో గత రెండు మ్యాచ్‌ల్లాగే ఈ మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి ప్రేక్షకులకు కావాల్సి అసలు సిసలు టీ20 మజా అందించింది.
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తన జట్టుకు సంచలన విజయాన్నందించగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్, పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల సాయంతో లక్నో చివరి బంతికి విజేతగా నిలిచింది. నిన్న డీసీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, తిలక్ వర్మ మెరుపుల సాయంతో ముంబై కూడా చివరాఖరి బంతికే విజయం సాధించింది.
కాగా, గత రెండు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్ వేసిన బౌలర్లు మంచికో చెడుకో ఏదో ఓ కారణంగా వార్తల్లో నిలిచారు. రింకూ సింగ్ ఊచకోత ధాటికి బలైన యశ్ దయాల్, ఆఖరి బంతికి మన్కడింగ్ చేసే ప్రయత్నం చేసి విఫలమైన హర్షల్ పటేల్ వేర్వేరు కారణాల చేత ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ రెండు సందర్భాల్లో బౌలర్లు శక్తివంచన లేకుండా కృషి చేసినప్పటకీ, బ్యాటర్ల ఆధిపత్యం కారణంగా వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.
అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన, ప్రత్యర్ధిని దాదాపు ఓడించినంత పని చేసిన డీసీ పేసర్ అన్రిచ్ నోర్జేకు మాత్రం దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఈ సీజన్‌లో ముంబై తొలి గెలుపు, సుదీర్ఘకాలం తర్వాత హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా నోర్జే ప్రదర్శన మరుగున పడింది.
చివరి ఓవర్‌లో ముంబై గెలుపుకు కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం కాగా.. నోర్జే అత్యంత పిసినారిగా మారి, మ్యాచ్‌ను ఆఖరి బంతివరకు తీసుకొచ్చాడు. తొలి బంతికి సింగిల్ ఇచ్చిన నోర్జే.. ఆతర్వాత 2, 3 బంతులు డాట్‌బాల్స్ వేసి 4,5 బంతులకు రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చి ముంబై శిబిరానికి ముచ్చెమటలు పట్టించాడు. అయితే ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ 2 పరుగులు తీయడంతో, బతుకు జీవుడా అని ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment