శ్రేయస్ అయ్యర్ (PC: PTI)
ప్రస్తుతం తాను ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నానని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. గతం గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృథా చేయాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నానని.. పదిహేడో ఎడిషన్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యానని తెలిపాడు.
కాగా గత కొన్ని రోజులుగా శ్రేయస్ అయ్యర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో బీసీసీఐ ఈ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌ను వార్షిక కాంట్రాక్టు నుంచి తప్పించింది.
గాయం తీవ్రత ఎక్కువగా లేదని జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యులు చెప్పినా.. గాయాన్ని సాకుగా చూపి రంజీ బరిలో దిగలేదని వేటువేసింది. ఆ తర్వాత మళ్లీ ముంబై జట్టు తరఫున రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. రంజీ ట్రోఫీ 2023-23 ఫైనల్లో 95 పరుగులతో సత్తా చాటాడు.
ఇక ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా మైదానంలో దిగనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తనపై జరుగుతున్న ప్రచారాలపై స్పందించాడు.
‘‘ఆ డాక్టర్ ఏం చెప్పాడన్న విషయం గురించి నేను పట్టించుకోను. వెన్నునొప్పితో నేను బాధపడుతున్న మాట వాస్తవం. అయితే, దాని గురించే అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే పనులుకావు.
నా అత్యుత్తమ నైపుణ్యం ఏమిటో వెలికితీసేందుకు ప్రయత్నించాలి. అందుకే ఈ చెత్తనంతా పక్కనపెట్టి.. ప్రస్తుతం మున్ముందు ఏం చేయాలన్న అంశం మీద దృష్టి పెట్టాలి.
నాకు తెలిసి నా ఆట తీరు బాగానే ఉంది. ప్రస్తుతం నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా.. కొంతకాలం దూరమైనంత మాత్రాన పెద్దగా మార్పేమీ రాదు.
ఐపీఎల్ తాజా సీజన్ కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధుడినయ్యాను. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. షాట్లు ఆడుతున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నాడు. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా రావడం, మిచెల్ స్టార్క్ జట్టుతో ఉండటం సానుకూలాంశమని అయ్యర్ అన్నాడు. కాగా గాయం కారణంగా అయ్యర్ గత ఐపీఎల్ సీజన్‌కు దూరమైన విషయం తెలిసిందే.
చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?
Comments
Please login to add a commentAdd a comment