శ్రేయస్ అయ్యర్ (PC: BCCI Domestic X)
వరుస వైఫల్యాలతో విమర్శలపాలైన టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. దులిప్ ట్రోఫీ-2024లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఇండియా-‘డి’ జట్టుకు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇండియా- ‘సి’తో మ్యాచ్‌లో.. రెండో ఇన్నిం గ్స్‌లో 44 బంతులు ఎదుర్కొని 54 పరుగులు చేశాడు.
బంగ్లాతో సిరీస్‌లో చోటు దక్కాలంటే..
కాగా సెప్టెంబరు 19 నుంచి సొంతగడ్డపై టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఈ సిరీస్ భారత్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మినహా మిగతా టీమిండియా స్టార్లంతా దులిప్ ట్రోఫీ బరిలో దిగారు. ఈ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో సత్తా చాటి బంగ్లాతో ఆడే జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
వరుస మ్యాచ్‌లలో విఫలం
అయితే, శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల ముంబై జట్టు తరఫున బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన అయ్యర్.. నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇండియా-డి జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది.
ఈ క్రమంలో గురువారం(సెప్టెంబరు 5) అనంతపురం వేదికగా ఇండియా-‘సి’తో మొదలైన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచాడు. పదహారు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో అభిషేక్ పొరల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అక్షర్ ఆల్‌రౌండ్ షోతో
ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇండియా-‘డి’కి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 118 బంతుల్లో 86 పరుగులతో అక్షర్ రాణించగా.. ఇండియా-‘డి’ 164 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా-‘సి’కి ఇండియా-‘డి’ బౌలర్లు చెక్ పెట్టారు. పేసర్లు హర్షిత్ రాణా(4/33), అర్ష్‌దీప్ సింగ్(1/29), ఆదిత్య థాకరే(1/33), స్పిన్నర్లు అక్షర్ పటేల్(2/46), సారాంశ్ జైన్(2/16) రాణించడంతో ఇండియా-‘సి’ 168 పరుగులకు ఆలౌట్ కాగా.. కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్
ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇండియా-‘డి’ టీ విరామ సమయానికి 24 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడే(15), యశ్ దూబే(5) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.
అయితే, 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన శ్రేయస్.. రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండటం విశేషం. టీ బ్రేక్ సమయానికి దేవ్‌దత్ పడిక్కల్ 42, రికీ భుయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: DT 2024: ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment