
బుమ్రా బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు... ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో ప్రత్యర్థి పని పట్టాడు...జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా...షమీ, సిరాజ్ తలో చేయి వేశారు.
టీమిండియా సమష్టి ప్రదర్శన ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ విలవిల్లాడింది. భారత పేసర్లను ఎదుర్కోలేక 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆ జట్టు సొంతగడ్డపై రెండో రోజే భారత్ ముందు బేలగా మారిపోయింది... ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన మన జట్టుకు మ్యాచ్‌పై పట్టు చిక్కేసింది. ఏకంగా 332 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్‌ను బెయిర్‌స్టో, స్టోక్స్ కలిసి ఎంత వరకు రక్షిస్తారనేది చూడాలి.
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన భారత జట్టు రెండో రోజే దానికి బాటలు పర్చుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జో రూట్ (31) టాప్ స్కోరర్‌గా నిలవగా...ప్రస్తుతం బెయిర్‌స్టో (12 బ్యాటింగ్), స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 338/7తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) సెంచరీ సాధించగా, జస్‌ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో రెండో రోజు 38.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
11.5 ఓవర్లు...78 పరుగులు...
తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన 3 వికెట్లతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఆ ప్రయత్నంలో సఫలమైంది. ఓవర్‌కు 6.7 పరుగుల రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన టీమిండియా 71 బంతుల్లో 78 పరుగులు సాధించింది. పాట్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన జడేజా 184 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. జడేజాకు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ కాగా, విదేశాల్లో మొదటిది. షమీ (16)ని అవుట్ చేసి బ్రాడ్ టెస్టుల్లో 550వ వికెట్ పూర్తి చేసుకోగా, అండర్సన్ బౌలింగ్‌లో జడేజా క్లీన్‌బౌల్డయ్యాడు. బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్లో విశ్వరూపం చూపించిన బుమ్రా స్కోరును 400 పరుగులు దాటించగా, సిరాజ్ (2) అవుట్ చేసి అండర్సన్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోవడంతో భారత్ ఆట ముగిసింది.
టపటపా...
బ్యాటింగ్‌లో చెలరేగిన జోరులో బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా ఇక్కడా దానిని కొనసాగించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను ఊపిరి సలపనీయకుండా చేసిన బుమ్రా తన 25 బంతుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా దెబ్బకు లీస్ (6), క్రాలీ (9), పోప్ (10) పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షంతో బుమ్రా, షమీకి తగినంత విరామం లభించి సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగారు. వాన ఆగి ఆట మళ్లీ మొదలైన తర్వాత ఇంగ్లండ్ అతి జాగ్రత్తగా ఆడబోయింది. ఇదే క్రమంలో సిరాజ్ అద్భుత బంతితో రూట్‌ను పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. నైట్‌వాచ్‌మన్ లీచ్ (0) కూడా నిలబడలేకపోవడంతో స్టోక్స్ బరిలోకి దిగాల్సి వచ్చింది.
రెండు నోబాల్‌లు, 2 వికెట్లు...
బుమ్రాకు శనివారం అన్నీ కలిసొచ్చాయి. బ్యాటింగ్‌లో అనూహ్య ఇన్నింగ్స్‌తో చెలరేగిన అతను అదే జోరులో బౌలింగ్‌లో తన సత్తాను ప్రదర్శించాడు. టాప్–3 వికెట్లు అతని ఖాతాలోనే చేరాయి. ఇందులో రెండు అదనపు బంతుల ద్వారానే రావడం విశేషం. తన రెండో ఓవర్ చివరి బంతికి బుమ్రా నోబాల్ వేయగా...తర్వాతి బాల్‌కు లీస్ వికెట్ దక్కింది. ఆ తర్వాత తన ఆరో ఓవర్ చివరి బంతిను కూడా అతను నోబాల్ వేశాడు. దాంతో ఏడో బాల్ వేయాల్సి రాగా... దానికీ పోప్ అవుటయ్యాడు.