లండన్‌లో భార్య ప్రీతితో విహారి
ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన భారత క్రికెట్ జట్టు సభ్యులకు ఈ టూర్‌కు ముందు సరైన ప్రాక్టీస్ లభించలేదు కానీ జట్టులోని ఒక ఆటగాడు మాత్రం ఇదే సిరీస్ కోసం చాలా రోజులుగా సన్నద్ధమవుతున్నాడు. ఎక్కడో కాకుండా అదే ఇంగ్లండ్ గడ్డపై ఆడుతూ తన ఆటకు అతను పదును పెట్టుకున్నాడు. అతనే గాదె హనుమ విహారి. కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆంధ్ర బ్యాట్స్‌మన్ మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి టెస్టు సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇక్కడే అరంగేట్రం చేసిన విహారి ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు.
లండన్: ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు చిరస్మరణీయ విజయంలో భాగంగా ఉన్న హనుమ విహారి సిడ్నీ టెస్టులో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకున్న అనంతరం మరోసారి టీమిండియా సభ్యుడిగా జట్టులో భాగమయ్యాడు. 2018 సిరీస్‌లో ఓవల్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన విహారి అదే మ్యాచ్‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నేళ్లలో తన ఆటతీరు మారిందని చెబుతున్న విహారి ‘క్రిక్‌ఇన్ఫో’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో పలు అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు అతని మాటల్లోనే...
ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ పరిస్థితులపై...
నిజంగా ఇక్కడ బ్యాటింగ్ పెద్ద సవాల్ వంటిదే. ఎండ కాసినప్పుడు బ్యాటింగ్ కొంత సులువవుతుంది కానీ ఆకాశం మబ్బు పట్టి ఉంటే చాలు ఒక్కసారిగా కష్టంగా మారిపోతుంది. దాదాపు రోజంతా బంతి స్వింగ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూక్ బంతులు బాగా ప్రభావం చూపిస్తాయి. బౌలర్లకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రీజ్‌లో నిలదొక్కుకున్నామని అనిపించిన సమయంలో కూడా అనూహ్య స్వింగ్ ఇబ్బంది పెడుతుంది. డ్యూక్ బంతులపై సీమ్ ఎక్కువగా ఉండటం కూడా కారణం.
కౌంటీల్లో అనుభవంపై...
నేను ఇంగ్లండ్‌కు వచ్చిన సమయంలో బాగా చలిగా ఉంది. ఆ వాతావరణంలో బంతి మరింత ప్రభావం చూపించింది. అందుకే నా తొలి కౌంటీ మ్యాచ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను. బ్రాడ్ బౌలింగ్‌ను సరిగా ఎదుర్కోలేక డకౌట్ అయ్యాను. ఇక్కడ డ్రైవ్ చేయడం కూడా అంత సులువు కాదు. ఇదే తరహా షాట్ నేను భారత్ లో ఆడి ఉంటే అవుట్ కాకపోయేవాడిని. ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు షాట్ సెలక్షన్ చాలా ముఖ్యం. అయితే మెల్లగా అన్నీ చక్కదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేశాను. స్టాన్స్ కూడా మార్చుకున్నాను. ఇప్పుడు ఈ అనుభవమే నాకు పెద్ద బలం. టీమిండియా తరఫున బాగా ఆడేందుకు ఇదంతా అక్కరకొస్తుంది.
2018తో పోలిస్తే ఈ సిరీస్‌పై...
అప్పుడు నా మొదటి టెస్టు ఆడాను. అనుభవం లేని కుర్రాడిని. బ్యాటింగ్ చేసేటప్పుడు కాళ్ల కదలికలు కూడా భిన్నంగా ఉండేవి. అందుకే అండర్సన్, బ్రాడ్ ఇన్‌స్వింగర్లను ఎలా ఆడాడో కోహ్లి సూచించాల్సి వచ్చింది. వాటిని నేను అమలు చేశాను కూడా. అయితే ఇప్పుడు నా ఆట చాలా మెరుగైంది. స్వింగర్లను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నా. నా బ్యాటింగ్‌పై నియంత్రణ పెరిగింది. క్రీజ్‌లో కదలికలు ఎలా ఉండాలో బాగా తెలుసు. అదనంగా కౌంటీ అనుభవం కూడా వచ్చింది కాబట్టి ఈ సిరీస్‌లో మంచి స్కోర్లు సాధిస్తాననే నమ్మకం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment