Eoin Morgan Calls Time on His Professional Playing Career - Sakshi
Sakshi News home page

Eoin Morgan: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌

Published Mon, Feb 13 2023 3:27 PM | Last Updated on Mon, Feb 13 2023 3:50 PM

Eoin Morgan Calls Time On His Professional Playing Career - Sakshi

Eoin Morgan: ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌, ఆ దేశ పరిమిత​ ఓవర్ల మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇదివరకే (2022 జూన్‌ 28) గుడ్‌బై చెప్పిన మోర్గాన్‌.. తాజాగా అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. మోర్గాన్‌.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత మిడిల్‌సెక్స్‌ (ఇంగ్లండ్‌ కౌంటీల్లో), సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్‌ రాయల్స్‌ జట్ల తరఫున కొనసాగుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు.

అయితే క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్‌కాస్టర్లతో తన అనుబంధం కొనసాగుతుందని తెలిపాడు. తాను విడుదల చేసిన లేఖలో మోర్గాన్‌ ఇలా అన్నాడు. విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడటం వల్ల చాలా నేర్చుకున్నానని, ఈ క్రమంలో చాలామంది వ్యక్తులతో జీవితకాల పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగిన తర్వాత కుటుంబంతో ఎక్కువగా గడపగలుగుతున్నానని.. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని అన్నాడు. తన క్రికెట్‌ జర్నీలో తోడుగా, అండగా ఉన్న అభిమానులకు, సహచరులకు, కుటుంబానికి మోర్గాన్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.  

కాగా, ఐర్లాండ్‌ జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించిన మోర్గాన్‌.. ఇంగ్లండ్‌ తరఫున తన 13 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగుల రికార్డులు మోర్గాన్‌ పేరిటే నమోదై ఉన్నాయి. 2019లో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన 36 ఏళ్ల మోర్గాన్‌.. గత సంవత్సరకాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలు, ఫామ్‌ లేమితో సతమతమవుతున్నాడు. 

ఏడేళ్ల పాటు ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా సేవలందించిన మోర్గాన్‌.. కెరీర్‌ మొత్తంలో (ఐర్లాండ్‌తో కలుపుకుని) 16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు, వన్డేల్లో 14 సెంచరీలు, 47 హాఫ్‌ సెంచరీల సాయంతో 7701 పరుగులు, టీ20ల్లో 14 హాఫ్‌ సెంచరీల సాయంతో  2458 పరుగులు చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement