
సూర్యకుమార్ యాదవ్ (Photo Credit: IPL/BCCI)
IPL 2023- Suryakumar Yadav: ‘‘సూర్యకుమార్ ఇంకో పన్నెండుసార్లు డకౌట్ అయినా.. అతడిని క్షమించేయొచ్చు. అలాంటి అద్భుతమైన ఆటగాడికి ఎన్ని అవకాశాలు అయినా ఇవ్వొచ్చు. అతడు డకౌట్ కావడం అన్నది పెద్ద విషయమేమీ కాదు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు అండగా నిలిచాడు.
కాగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో సూర్య విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఈ మిస్టర్ 360.. తాజాగా ఐపీఎల్-2023 సీజన్‌లోనూ వైఫల్యం కొనసాగిస్తున్నాడు.
మూడు మ్యాచ్‌లలో కలిపి చేసింది 16 పరుగులే
ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో చేసిన మొత్తం పరుగులు 16. అత్యధిక స్కోరు 15. మూడు మ్యాచ్‌లలో వరుసగా అతడు నమోదు చేసిన స్కోర్లు 15, 1, 0.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సూర్య.. ఐపీఎల్-2023లో ఆఖరిగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మరోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అటు అంతర్జాతీయ స్థాయిలో.. ఇటు తనకు అచ్చొచ్చిన ఐపీఎల్‌లోనూ సూర్య విఫలం కావడం విమర్శలకు దారితీసింది.
డకౌట్ అయితే..
ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ సూర్యకుమార్ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇంగ్లండ్, న్యూజిలాండ్ గడ్డపై ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం నాలుగుసార్లు డకౌట్ అయినంత మాత్రాన తనకేమీ ఫరక్ పడదు.
సూర్యకుమార్ గొప్ప ఆటగాడన్న విషయం అందరికీ తెలుసు. ఎవరైనా ఓ బ్యాటర్ ఫామ్‌లో లేడంటే విమర్శలు సహజం. అయితే, సూర్య విషయంలో ఫామ్ అనేది తాత్కాలికం.. క్లాస్ అనేది శాశ్వతం. వన్డేల్లో తను తడబాటుకు లోనవుతున్నాడన్నది వాస్తవమే.
కానీ.. ప్రతి బ్యాటర్ జీవితంలో ఒకానొక దశలో ఇలాంటి గడ్డు పరిస్థితులు సహజం. అయితే, జట్టు యాజమాన్యం మద్దతుగా నిలబడితే ఈ మ్యాచ్ విన్నర్ కచ్చితంగా అద్భుతాలు చేయగలడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాడికి మద్దతుగా నిలవడం అత్యవసరం’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
కోల్‌కతా కెప్టెన్ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్