టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శ్రీలంక ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు సంధించాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్ వైఫల్యం వల్లే లంక చిత్తుగా ఓడిందని అభిప్రాయపడ్డాడు.
కాగా న్యూయార్క్ వేదికగా శ్రీలంక సోమవారం సౌతాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. బౌన్సీ పిచ్‌పై సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో 19.1 ఓవర్లలోనే లంక కథ ముగిసిపోయింది.
ఇక ఈ వికెట్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తడబడినా.. ఆచితూచి ఆడి ఎట్టకేలకు గట్టెక్కారు. 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు 80 పరుగులు చేసి.. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక బ్యాటర్ల తీరును తప్పుబట్టాడు. బంతి బౌన్స్ అవుతున్నా.. ఏమాత్రం ఆలోచన లేకుండా చెత్త షాట్లకు యత్నించి అవుటయ్యారని విమర్శించాడు.
ఒక్క బ్యాటర్ కూడా బ్యాట్స్‌మన్‌షిప్ ప్రదర్శించలేదంటూ పెదవి విరిచాడు. వికెట్‌ను గమనిస్తూ బ్యాటింగ్ చేస్తే కనీసం 120 పరుగులైనా స్కోరు చేసేవారని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
అదే జరిగితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక కచ్చితంగా సౌతాఫ్రికాపై గెలిచేదని పేర్కొన్నాడు. అనూహ్య బౌన్స్‌తో బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపికగా ఆడి విజయం సొంతం చేసుకున్నారని ఇర్ఫాన్ పఠాన్ ప్రొటిస్ జట్టును అభినందించాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. నసావూ కౌంటీ పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనపుడు లంక కెప్టెన్ వనిందు హసరంగా బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పే చేశాడని విమర్శించాడు. ఫలితంగా శ్రీలంక తమ టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు పరిమితమైందని పఠాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment