టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోహ్లి ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా జనాలు అతని దర్శనం కోసం ఎగబడతారు. భారత్‌లో అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. విరాట్ ఎక్కడ ఉంటే అక్కడ జాతరను తలపిస్తుంది. రన్ మెషీన్‌ను చూసేందుకు జనాలు పోటెత్తుతారు. ఈ మధ్యకాలంలో అయితే కోహ్లి ఆన్ ద ఫీల్డ్ ఉన్నా అభిమానులు వదిలిపెట్టడం లేదు. మైదానంలోకి దూసుకొచ్చి మరీ తమ ఆరాధ్య క్రికెటర్‌ను కలుస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది.
The moment when a fan touched Virat Kohli's feet and hugged him.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024
- King Kohli, the crowd favourite. 😍pic.twitter.com/NfShGwtF8I
ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్ గ్రౌండ్ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు. తొలుత ఆ అభిమాని తనవైపు వస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించిన కోహ్లి ఆ తర్వాత అతన్ని హత్తుకున్నాడు. ఈలోపు సిబ్బంది వచ్చి ఆ అభిమానికి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే, 429 సుదీర్ఘ విరామం తర్వాత నిన్నటి మ్యాచ్‌తోనే విరాట్ తిరిగి అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ 16 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63 నాటౌట్) చెలరేగడంతో భారత్.. ఆఫ్ఘనిస్తాన్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ను భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్ (3/32), అక్షర్ పటేల్ (2/17), రవి భిష్ణోయ్ (2/39), శివమ్ దూబే (1/36) కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment