యశ్‌పాల్ శర్మ ( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: భారత క్రికెట్ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన 1983 వరల్డ్ కప్ విజయంలో తనదైన భూమిక పోషించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యశ్‌పాల్ శర్మ మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగొచ్చిన అనంతరం యశ్‌పాల్ తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 1978లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన యశ్‌పాల్ 1985లో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఫస్ట్‌క్లాస్ కెరీర్ రెండు దశాబ్దాల పాటు సాగింది. యశ్‌పాల్ 37 టెస్టుల్లో 33.45 సగటుతో 1,606 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 42 వన్డేల్లో 28.48 సగటుతో 4 అర్ధసెంచరీలు సహా 883 పరుగులు సాధించారు. తన 40 వన్డే ఇన్నింగ్స్‌లలో ఆయన ఒక్కసారి కూడా డకౌట్ కాకపోవడం విశేషం.
కోచ్‌గా... సెలక్టర్‌గా...
ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా, కామెంటేటర్‌గా, క్రికెట్ పరిపాలకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. దేశవాళీ క్రికెట్‌లో యశ్‌పాల్ అంపైర్‌గా, మ్యాచ్ రిఫరీగా కూడా పని చేశారు. యశ్‌పాల్ రెండు పర్యాయాలు సెలక్టర్‌గా వ్యవహరించారు. 2004 నుంచి 2005 మధ్య కాలంలో పని చేసినప్పుడు ధోనిని ఆటగాడిగా ఎంపిక చేసిన బృందంలో ఉన్న ఆయన... 2008 నుంచి 2011 వరకు సెలక్టర్‌గా ఉన్నారు. ధోని సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టును ఎంపిక చేసిన కమిటీలోనూ యశ్‌పాల్ సభ్యుడు కావడం విశేషం.
కపిల్ కన్నీళ్లపర్యంతం...
మాజీ సహచరుడు యశ్‌పాల్ మరణవార్త విన్న వెంటనే 1983 వరల్డ్‌కప్ టీమ్ సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల జూన్ 25న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీరంతా కలుసుకున్నారు. యశ్‌పాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. యశ్‌పాల్ మృతి గురించి విన్న కపిల్‌దేవ్ కన్నీళ్లపర్యంతమయ్యారు. స్పందన కోరగా ‘నాకు మాటలు రావడం లేదు’ అని జవాబి చ్చారు. ‘మా సహచరుల్లో అత్యంత ఫిట్‌గా, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి యశ్‌పాల్. ఇలా జరగడం బాధాకరం’ అని వెంగ్సర్కార్ వ్యాఖ్యా నించగా... తమ ‘83’ కుటుంబంలో ఒకరిని కోల్పోయామని బల్వీందర్ సంధూ అన్నారు.
పరిమిత ‘యశస్సు’
మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్, గార్నర్... ఇలాంటి భీకర పేస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 1983 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై యశ్‌పాల్ 89 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన భారత్‌ను గెలిపించగా, విండీస్‌కు వరల్డ్ కప్ చరిత్రలోనే అది తొలి ఓటమి. కపిల్, గావస్కర్, వెంగ్సర్కార్, శ్రీకాంత్, అమర్‌నాథ్‌వంటి సహచరులతో పోలిస్తే యశ్‌పాల్‌కు వరల్డ్ కప్ విజయం ద్వారా తగినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను చేసిన 61 పరుగులు ఇన్నింగ్స్ అద్భుతం. ఈ మ్యాచ్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో నాటి అభిమానులు దీనిని ఎప్పటికీ మరచిపోలేరు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్లీస్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలచిన తీరు అద్భుతం. అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు, సగటు చూస్తే అతను ఒక సాధారణ ఆటగాడిగానే కనిపించవచ్చుగానీ యశ్‌పాల్‌లాంటి ఆటగాళ్ల ప్రత్యే కతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలు పనికి రావు. భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన విశిష్ట ఆటగాడిగా యశ్‌పాల్ ఎప్పటికీ నిలిచిపోతారు.
యశ్‌పాల్ శర్మ కెరీర్‌లో ముఖ్య విషయాలు:
►1954 ఆగస్టు 11న పంజాబ్‌లోని లుధియానాలో జననం
►1978 అక్టోబర్ 13న పాకిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం.. మరుసటి ఏడాది 1979లో డిసెంబర్ 2న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో ఎంట్రీ
►1970,80ల కాలంలో భారత మిడిలార్డర్ క్రికెట్‌లో ముఖ్యపాత్ర
►1980-81లో అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణింపు
►యశ్‌పాల్ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు.
► విండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్‌పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో 1985లోనే అర్థంతరంగా ఆటకు వీడ్కోలు
Very Very Sad News to Share…World Cup Winner @cricyashpal Sh Yashpal Sharma ji had a major Cardiac Arrest in the morning today…Rest In Peace Champion player @indiatvnews
— Samip Rajguru (@samiprajguru) July 13, 2021
Comments
Please login to add a commentAdd a comment