రవిశాస్త్రి- రవిచంద్రన్ అశ్విన్
Ravi Shastri- Ashwin: టీమిండియా డ్రెసింగ్ రూం వాతావరణం గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కొలీగ్సే ఒక్కోసారి ప్రాణ స్నేహితుల్లా మారతారని.. అయినా ఒకరి జీవితంలో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారని ప్రశ్నించాడు. కాగా అనూహ్య రీతిలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వలేదు మేనేజ్‌మెంట్.
విదేశీ గడ్డ మీద అశూకు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైపే మొగ్గు చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుకావడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అప్పుడు స్నేహితులు.. ఇప్పుడు కొలీగ్స్
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెదిలేవారని.. ఇప్పుడు మాత్రం కేవలం కొలీగ్స్‌లా ఉంటున్నారని వ్యాఖ్యానించాడు. సహచర ఆటగాళ్లతో మాట్లాడే తీరిక ఎవరికీ ఉండటం లేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో ది వీక్‌తో మాట్లాడిన టీమిండియా మాజీ హెడ్‌కోచ్, అశ్విన్‌తో కలిసి పనిచేసిన రవిశాస్త్రిని అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరారు.
ఈ క్రమంలో.. ‘‘నాకైతే ఎల్లప్పుడూ కొలీగ్స్ మాత్రమే ఉండేవారు. నిజానికి మన స్నేహితులే కొలీగ్స్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అయినా ఒక వ్యక్తికి ఎంత మంది బెస్టీస్ ఉంటారు? 4-5 మంది అంతేకదా!
వాళ్లతో నేను సంతోషంగా ఉన్నా
నాకైతే ఐదుగురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్లతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతకు మించి నాకేమీ అవసరం లేదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. కొలీగ్స్ స్నేహితులు కావొచ్చు. కాకపోవనూవచ్చు. ప్రస్తుతం నాకైతే కామెంటరీ బాక్స్‌లో చాలా మంది కొలీగ్స్ ఉన్నారు’’ అంటూ సరదాగా బదులిచ్చాడు.
కాగా 2021లో హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. తిరిగి కామెంట్రీ మొదలుపెట్టాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వని మేనేజ్‌మెంట్.. జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ జట్టుకు ఎంపిక చేసింది. విండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్ భాగం కానున్నాడు.
చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై అశ్విన్ విసుర్లు!
Comments
Please login to add a commentAdd a comment