టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా మరో ముందడుగు వేసింది. నమీబియాతో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుని సూపర్-8 దశకు అర్హత సాధించింది. ప్రత్యర్థిని 72 పరుగులకే పరిమితం చేసి.. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
తద్వారా ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాపై జయభేరి మోగించి భారీ రన్‌రేటుతో సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ నమీబియాపై భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టులో కీలక సభ్యుడైన ఆడం జంపా ఈ మ్యాచ్‌లో ప్రధాన పాత్ర పోషించాడని ప్రశంసించాడు.
అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం
‘‘ఈరోజు మా బౌలింగ్ విభాగం అత్యద్భుతంగా రాణించింది. సమిష్టి కృషితో దక్కిన విజయం ఇది. సూపర్-8కు అర్హత సాధించడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు.
రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ప్రదర్శనతో వరుస గెలుపులు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాం. ఇక జంపా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.
గత నాలుగైదేళ్లుగా మా జట్టులో అతడు అత్యంత ముఖ్యమైన సభ్యుడిగా ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడం తన ప్రత్యేకత. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆడం జంపాను కొనియాడాడు.
విండీస్‌లో బీచ్‌లు సూపర్
ఇక వెస్టిండీస్ ఆతిథ్యం గురించి మార్ష్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. చాలా బీచ్‌లు ఇక్కడున్నాయి. ఒక్కోసారి మాకు పెర్త్‌లో ఉన్న అనుభూతి కలుగుతోంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా అమెరికాతో కలిసి విండీస్ ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్-డి: ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా
👉వేదిక: సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
👉టాస్: ఆస్ట్రేలియా.. తొలుత బౌలింగ్
👉నమీబియా స్కోరు: 72 (17)
👉టాప్ స్కోరర్: గెర్హార్డ్ ఎరాస్మస్(43 బంతుల్లో 36 పరుగులు)
👉ఆస్ట్రేలియా స్కోరు: 74/1 (5.4)
👉టాప్ స్కోరర్: ట్రావిస్ హెడ్ (17 బంతుల్లో 34 రన్స్, నాటౌట్)
👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా. సూపర్-8కు అర్హత
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడం జంపా(4/12).
చదవండి: T20 WC 2024: గెలిచి నిలిచిన పాక్
Comments
Please login to add a commentAdd a comment