IPL 2023, DC Vs RCB: Mohammed Siraj Gets Into A Heated Argument With DC Opener Phil Salt And David Warner - Sakshi
Sakshi News home page

Mohammed Siraj Vs Phil Salt: సిరాజ్.. పద్దతి మార్చుకో ; ఏం లాభం పూనకం వచ్చినట్లు చెలరేగాడు

Published Sat, May 6 2023 11:37 PM | Last Updated on Mon, May 8 2023 11:38 AM

Heat-Conversation Between Mohammed Siraj- Delhi Capitals Openers Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికి తన ప్రవర్తనతో విలన్‌గా మారుతున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి, గంభీర్‌ గొడవకు మూలకారకుడు సిరాజ్‌ అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ గొడవ మరిచిపోకముందే సిరాజ్‌ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌.. ఫిల్‌ సాల్ట్‌తో గొడవ పడడం.. మధ్యలో వచ్చిన వార్నర్‌ను కూడా తిట్టడం ఆసక్తి రేపింది. వీరి మధ్య సంభాషణ చూస్తే కాస్త గట్టిగానే తిట్టుకున్నట్లు అర్థమవుతుంది.  విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ సిరాజ్‌ వేశాడు. అప్పటికే తొలి మూడు బంతులను ఫిల్‌ సాల్ట్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. నాలుగో బంతిని షార్ట్‌బాల్‌ వేయగా ఆన్‌ ది లైన్‌ దాటుకుంటూ వెళ్లింది.

కానీ ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో సాల్ట్‌ లెగ్‌ అంపైర్‌వైపు తిరిగాడు. లెగ్‌ అంపైర్‌ మొదట ఏమి చెప్పలేదు అయితే బంతిని చెక్‌ చేసి అది వైడ్‌గా పరిగణించాడు.దీంతో సాల్ట్‌ సిరాజ్‌ వైపు తిరిగి ఏదో అన్నాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సిరాజ్‌ సాల్ట్‌ మీదకు ఆవేశంగా దూసుకొచ్చాడు.

ఈలోగా ఢిల్లీ కెప్టెన్‌ వార్నర్‌ తలదూర్చగా.. సిరాజ్‌ తన పెదవులపై వేలు పెట్టి ''ష్‌(Shh)'' అన్నట్లుగా సాల్ట్‌ను చూస్తూ సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో సాల్ట్‌ బౌలింగ్‌ వేయడానికి వెళ్లు అని అరిచాడు. అంపైర్‌, ఆర్‌సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ వచ్చి సిరాజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సిరాజ్‌తో గొడవను పర్సనల్‌గా తీసుకున్న ఫిల్‌ సాల్ట్‌ ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలిసారి తన బ్యాటింగ్‌ పవరేంటో రుచి చూపిన సాల్ట్‌ 45 బంతుల్లో 87 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌ 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 182 పరుగుల టార్గెట్‌ను 16.4 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

కాగా వీడియో చూసిన అభిమానులు.. సిరాజ్‌ను తప్పుబట్టారు.'' సిరాజ్‌ ఇది మంచి పద్దతి కాదు.. నీ వైఖరి మార్చుకో.. గొడవపడ్డావు.. ఏం లాభం.. అక్కడ సాల్ట్‌ పూనకం వచ్చినట్లు చెలరేగాడు.. అంతా నీవల్లే'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: 'కింగ్‌' కోహ్లి చరిత్ర.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement