
ఐపీఎల్ 2023 సందర్భంగా విరాట్ కోహ్లితో చోటు చేసుకున్న వివాదంపై గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు. నాటి తన ప్రవర్తనను గంభీర్ సమర్ధించుకున్నాడు. నాటి ఉదంతంలో నవీన్ తప్పేమీ లేదని.. తన దృష్టిలో నవీన్ చేసింది కరెక్ట్ కాబట్టి, అతనికి అండగా నిలబడ్డాడని, మెంటార్‌గా అది నా కనీస బాధ్యత అని వివరణ ఇచ్చాడు.
ఒకవేళ ఆ సందర్భంలో కోహ్లి చేసింది కరెక్ట్ అయ్యుంటే, అతని పక్షాన నిలబడేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని తెలిపాడు. ఆట ఏదైనా ప్రతి ఆటగాడు గెలవాలని కోరుకోవడం సహజమని.. అందుకోసం ఎవరు కూడా హద్దులు దాటాల్సి పని లేదని హితవు పలికాడు.
తన దృష్టిలో ఏ ఆటగాడైనా ఒకటేనని.. ధోనితో అయినా విరాట్‌తో అయినా తన అనుబంధం ఒకటేలా ఉంటుందని.. కోహ్లితో జరిగిన వాగ్వాదం మైదానానికే పరిమితం అని వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాడు.
పరాయి దేశ ఆటగాడికి అండగా నిలబడి, స్వదేశీ ఆటగాడితో వాగ్వాదానికి దిగాడని వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. తన దృష్టిలో మన, పరాయి బేధాలు లేవని, ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వారి పక్షాన నిలబడతానని అన్నాడు.
కాగా, ఐపీఎల్ 2023లో లక్నో-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత నవీన్-విరాట్ మధ్య.. మ్యాచ్ అనంతరం గంభీర్-కోహ్లిల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గంభీర్-కోహ్లిలు బాహాబాహీకి దిగినంత పనిచేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ గంభీర్, కోహ్లిలకు జరిమానా కూడా విధించింది.
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు