క్రికెటర్లు... ముఖ్యంగా టీమిండియాకు ఆడేవాళ్లు.. అందులోనూ సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లు.. ఏడాదంతా ఏదో ఒక సిరీస్‌తో బిజీగానే ఉంటారు. సంవత్సరంలో వారికి కనీసం నెలరోజులు విశ్రాంతి దొరికితే అదే మహాభాగ్యం!.. ఇక ఫాస్ట్ బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరికి ఎల్లప్పుడూ గాయాల ప్రమాదం పొంచి ఉంటుంది.
వారే విలువైన ఆస్తి
కాబట్టి జట్టు యాజమాన్యం వీలైనంత ఎక్కువగా పేసర్లకు విరామం ఇవ్వాలని.. పనిభారం తగ్గించాలని ప్రయత్నిస్తుంది. అందుకు అనుగుణంగానే కీలకమైన సిరీస్‌లలో మాత్రమే ఆడిస్తుంది. ఇక ప్రపంచస్థాయి ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లను తమకు దొరికిన విలువైన ఆస్తిగా పరిగణిస్తూ ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది. మేనేజ్‌మెంట్లు ఇలా చేయడం ఆవశ్యకమే అంటున్నాడు బుమ్రా.
రెండున్నర నెలల విరామం తర్వాత
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు బుమ్రా. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక జూన్ 29న ముగిసిన ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత బుమ్రా ఆటకు దూరమయ్యాడు. దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
కోహ్లి పేరు వినాలని కోరుకుంటున్నారు!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ కార్యక్రమానికి హాజరైన బుమ్రాకు.. ‘‘భారత క్రికెట్ జట్టులో అత్యంత ఫిట్‌గా ఉండే ఆటగాడు ఎవరు?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు ఎలాంటి సమాధానం వినాలని కోరుకుంటున్నారో నాకు తెలుసు.
నేనే ఫిట్టెస్ట్ క్రికెటర్
అయితే, నేను మాత్రం నా పేరునే చెబుతాను. ఎందుకంటే నేను ఫాస్ట్‌బౌలర్‌ను. చాలా కాలం నుంచి టీమిండియాకు ఆడుతున్నాను. ఫాస్ట్‌బౌలర్‌ను అయి ఉండి.. ఉపఖండ పరిస్థితుల్లో రాణించడం తక్కువేమీ కాదు. నేను ఎల్లప్పుడూ ఫాస్ట్‌బౌలర్లనే ప్రమోట్ చేస్తా. ఫిట్టెస్ట్ క్రికెటర్లుగా వారి పేర్లనే చెబుతా’’ అని బుమ్రా కుండబద్దలు కొట్టాడు.
అదే విధంగా.. పేసర్లు ప్రతీ మ్యాచ్ ఆడటం అంత ఈజీ కాదని పేర్కొన్నాడు. కాగా భారత జట్టులో ఫిట్‌నెస్‌కు మారుపేరైన క్రికెటర్ విరాట్ కోహ్లి అన్న సంగతి తెలిసిందే. అయితే, బుమ్రా ఈ స్టార్ బ్యాటర్‌ను కాదని.. తన పేరు చెబుతూనే.. అందుకు గల కారణాన్నీ వెల్లడించాడు.
చదవండి: తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యంలో ఇండియా-‘ఎ’
Comments
Please login to add a commentAdd a comment