నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ గురువారం (డిసెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఉన్నారు. వీరి ముగ్గురూ నవంబర్ మంత్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.
జస్ప్రీత్ బుమ్రా..
గత నెలలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బుమ్రా అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కివీస్‌తో సిరీస్ కోల్పోయినప్పటికి బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు.
హ్యారీస్ రవూఫ్..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ స్పీడ్ స్టార్ హ్యారీస్ రవూఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి సిరీస్‌ను పాక్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కంగారులతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతడు 5 వికెట్లు పడగొట్టాడు.
మార్కో జాన్సెన్..
భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సఫారీ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ తన ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను చూపించాడు. బ్యాట్‌తోనూ బంతితోనూ అదరగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి ప్రోటీస్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.
చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment