ICC U19 Women's T20 World Cup Winner India: Meet Members and Interesting Facts - Sakshi
Sakshi News home page

T20 WC: 2005 వరల్డ్‌కప్‌ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్‌ కోచ్‌ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..

Published Mon, Jan 30 2023 9:18 AM | Last Updated on Mon, Jan 30 2023 10:38 AM

ICC U19 Women T20 WC Winner India: Meet Members Interesting Facts - Sakshi

దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్‌లో కూడా మన టీమ్‌ వరల్డ్‌కప్‌ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్‌ స్పిన్నర్‌ నూషీన్‌ అల్‌ ఖదీర్‌ ఇప్పుడు యువ మహిళల టీమ్‌కు కోచ్‌. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్‌ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది.

దాదాపు 2005 వరల్డ్‌కప్‌ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్‌ టీమ్‌ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్‌–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్‌కప్‌ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది.

అయితే ఎలాగైనా వరల్డ్‌కప్‌ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్‌ టీమ్‌లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించడం విశేషం.

శ్వేత సెహ్రావత్‌ 139.43 స్ట్రయిక్‌రేట్‌తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్‌లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్‌ కశ్యప్‌ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్‌ టీమ్‌లో జూనియర్‌గా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను కూడా ప్రదర్శించడం విశేషంసాక్షి క్రీడావిభాగం

వరల్డ్‌కప్‌ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా... 


షఫాలీ వర్మ (కెప్టెన్‌): హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన షఫాలీ భారత్‌ సీనియర్‌ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్‌ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.  

రిచా ఘోష్‌: బెంగాల్‌కు చెందిన కీపర్‌ రిచా కూడా సీనియర్‌ టీమ్‌ సభ్యురాలిగా 47 మ్యాచ్‌లు ఆడింది.  

పార్శవి చోప్రా: యూపీలోని గ్రేటర్‌ నోయిడాకు చెందిన లెగ్‌స్పిన్నర్‌. తండ్రి ఫ్లడ్‌ లైట్‌ సౌకర్యాలతో సొంత గ్రౌండ్‌ ఏర్పాటు చేసి మరీ కూతురును ఆటలో ప్రోత్సహించాడు.

ఎండీ షబ్నమ్‌: విశాఖపట్నానికి చెందిన షబ్నమ్‌ తల్లిదండ్రులు నేవీలో పని చేస్తారు. శివశివాని స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసులోనే 110 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.  

సౌమ్య తివారి: స్వస్థలం భోపాల్‌. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌... కోహ్లిని ఇష్టపడే సౌమ్య అతనిలాగే కవర్‌డ్రైవ్‌ అద్భుతంగా ఆడుతుంది.  

టిటాస్‌ సాధు: బెంగాల్‌కు చెందిన టిటాస్‌ తండ్రి ఒక క్రికెట్‌ అకాడమీ నడపిస్తాడు. బెంగాల్‌ సీనియర్‌ టీమ్‌కు ఇప్పటికే ఆడింది.  


గొంగడి త్రిష: భద్రాచలంకు చెందిన త్రిష హైదరాబాద్‌లో స్థిర పడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్‌–16లో ప్రాతినిధ్యం వహించింది.  

మన్నత్‌ కశ్యప్‌: పటియాలాకు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. ఇటీవల వరుసగా ‘మన్కడింగ్‌’లు చేసి గుర్తింపు తెచ్చుకుంది.  


శ్వేత సెహ్రావత్‌: ఢిల్లీకి చెందిన బిగ్‌ హిట్టర్‌. ఆర్థికంగా మెరుగైన నేపథ్యం ఉన్న కుటుంబం.  
సొప్పదండి యశశ్రీ: హైదరాబాద్‌కు చెందిన మీడియం పేసర్‌. టోర్నీ లో ఒక మ్యాచ్‌ ఆడింది. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చింది.  

అర్చనా దేవి: ఆఫ్‌స్పిన్నర్‌. యూపీలోని ఉన్నావ్‌ స్వస్థలం. కడు పేదరికం. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. కుల్దీప్‌ యాదవ్‌ కోచ్‌ కపిల్‌ పాండే దత్తత తీసుకొని ముందుకు నడిపించాడు.

 
సోనమ్‌ యాదవ్‌: యూపీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. తండ్రి ఫిరోజాబాద్‌లో చేతి గాజులు తయారు చేసే పరిశ్రమలో కార్మికుడు 

ఫలక్‌ నాజ్‌: స్వస్థలం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌. ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ తండ్రి ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ప్యూన్‌.  


రిషిత బసు: వికెట్‌ కీపర్, బెంగాల్‌లోని హౌరా స్వస్థలం. అద్భుతమైన మెరుపు షాట్‌లు ఆడుతుంది. మాజీ క్రికెటర్‌ లక్ష్మీరతన్‌ శుక్లా తన అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు.  

చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్‌.. సిట్సిపాస్‌కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement