త్వరలోనే తాను పునరాగమనం చేయనున్నట్లు టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ తెలిపాడు. తొలుత దేశవాళీ క్రికెట్‌లో ఆడతానని.. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే ఆస్ట్రేలియా పర్యటన గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఆడిన అనంతరం చీలమ గాయంతో షమీ ఆటకు పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అతనికి శస్త్రచికిత్స కూడా జరిగింది.
కాలిపై భారం పడకూడదని
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్న షమీ తొలిసారి తాను పూర్తి రనప్‌తో బౌలింగ్ చేసినట్లు తాజాగా వెల్లడించాడు. ఆ సమయంలో గాయానికి సంబంధించి తనకు ఎలాంటి నొప్పి కలగలేదని షమీ చెప్పాడు.
కాగా 34 ఏళ్ల షమీ ఆదివారం భారత్-న్యూజిలాండ్ టెస్టు ముగిసిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బౌలింగ్ చేశాడు. భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అతడి బౌలింగ్‌ను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. ‘కాలిపై భారం పడకూడదని చాలా రోజులుగా జాగ్రత్తగా, పరిమిత రనప్‌తో బౌలింగ్ చేస్తూ వచ్చాను. ఆదివారం మాత్రం చాలా సంతృప్తిగా అనిపించింది. పూర్తిగా నా సామర్థ్యం మేరకు బౌలింగ్ చేశాను. ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. 100 శాతం నొప్పి కూడా తగ్గిపోయింది. సాధ్యమైనంత త్వరగా బరిలోకి దిగాలని ఆశిస్తున్నా’ అని షమీ చెప్పాడు.
బెంగాల్ తరఫున బరిలోకి...
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు దేశవాళీ క్రికెట్‌లో రెండు, మూడు మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్న షమీ... అప్పుడే తన ఆట, ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వస్తుందని అన్నాడు. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో టీమిండియా- ఆసీస్ మధ్య తొలి టెస్టు జరగనుండగా... ఫిట్‌గా మారేందుకు షమీకి మరో నెల రోజుల సమయం ఉంది. ‘పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఆ్రస్టేలియాకు వెళ్లే ముందు నేను ఎంత దృఢంగా తయారవుతాననేది ముఖ్యం. ఫిట్‌గా లేకుండా అక్కడికి వెళ్లి ఏదైనా జరిగితే అది మంచిది కాదు.
డాక్టర్లు ఓకే చెప్పేలా రోజుకు కనీసం 20–30 ఓవర్లు బౌలింగ్ చేయాలని భావిస్తున్నా. అందు కోసం మ్యాచ్‌లు ఆడటమే సరైంది’ అని షమీ పేర్కొన్నాడు. భారత జట్టు ఆసీస్ బయల్దేరడానికి ముందు రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫిట్‌గా మారి కంగారూ గడ్డకు చేరితే భారత్, భారత్ ‘ఎ’ మధ్య జరిగే మూడు రోజుల మ్యాచ్‌లో కూడా షమీ ఆడవచ్చు.
బ్యాటర్లు తడబడ్డా.. మేము చెలరేగిపోవడం ఖాయం!
గాయం నుంచి కోలుకొని మళ్లీ ఆడటం అంత సులువు కాదని... ఈ సుదీర్ఘ విరామం ఓపికను ప్రదర్శించే లక్షణాన్ని తనలో పెంచిందని అతను అభిప్రాయ పడ్డాడు. ప్లేయర్ ఎప్పుడైనా తన ప్రతిభ, సత్తాపై నమ్మకాన్ని కోల్పోరాదని, ప్రస్తుతం తన పోరాటమంతా ఫిట్‌నెస్‌తోనే అతను షమీ చెప్పాడు.
140 కిలోమీటర్లకు పైగా బంతులు విసిరే ముగ్గురు పేసర్లు ఒకే సమయంలో జట్టులో ఆడటం అరుదని... ఆస్ట్రేలియాలోని బౌన్సీ వికెట్లపై మన జట్టు సాధారణ స్కోరు నమోదు చేసినా... బౌలర్లు చెలరేగిపోగలరని అతడు వ్యాఖ్యానించాడు. 2018–19 పర్యటనలో 16 వికెట్లతో భారత జట్టు ఆసీస్ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన షమీ... 2020–21 టూర్ తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ చేతికి గాయం కావడంతో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు.
చదవండి: Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
Comments
Please login to add a commentAdd a comment