ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం సెలక్టర్లు అతడికి మరోసారి పిలుపునిచ్చారు. అయితే, ఈసారి కేవలం బెంచ్‌కే పరిమితం చేయకుండా తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శతకాల ధీరుడు
కాగా ఉత్తరాఖండ్‌లో జన్మించిన అభిమన్యు దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇరవై తొమ్మిదేళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మెరుగైన రికార్డు ఉంది. రెడ్‌బాల్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 27 శతకాలు సాధించాడు.
ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు
ఇందులో గత నాలుగు సెంచరీలు ఇటీవల వరుసగా సాధించినవే. దులిప్ ట్రోఫీ-2024లో రెండు, రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇప్పటికి రెండు శతకాలు బాదాడు. మొత్తంగా ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 7500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
అభిమన్యు అద్భుత ప్రదర్శన కారణంగా 2022లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా సెలక్టర్లు అతడిని టీమిండియాకు ఎంపికచేశారు. కానీ.. అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. నాటి సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. అప్పుడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించగా.. ఈ ఓపెనింగ్ బ్యాటర్ అవసరం లేకుండా పోయింది.
రోహిత్ శర్మ స్థానంలో?
అయితే, వరుసగా నాలుగు సెంచరీలు బాదిన క్రమంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు అభిమన్యు తాజాగా ఎంపికయ్యాడు. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరం కానున్నాడనే వార్తల నడుమ అభిమన్యు ఎంపికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవేళ రోహిత్ నిజంగానే మొదటి టెస్టుకు దూరంగా ఉంటే.. యశస్వి జైస్వాల్‌తో కలిసి అభిమన్యుకు ఓపెనింగ్ చేసే అవకాశం లభిస్తుంది.
లేదంటే.. బెంగాల్ మాజీ రంజీ స్టార్, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి చెప్పినట్లు అభిమన్యును మిడిలార్డర్‌లో ట్రై చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎట్టకేలకు ఈ రంజీ వీరుడికి ప్రతిష్టాత్మక సిరీస్‌లో చోటు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా అన్‌క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యుతో పాటు ఆంధ్ర క్రికెటర్, టీమిండియా టీ20 రైజింగ్ స్టార్ నితీశ్‌కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టుల్లో చోటు సంపాదించుకున్నారు.
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
Comments
Please login to add a commentAdd a comment