
రాహుల్ తప్పులేదు... బౌలర్లు అద్భుతంగా రాణించారు.. టీమిండియా ఎందుకు ఓడిపోయిందంటే!
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 1st ODI: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ అండగా నిలిచాడు. రోహిత్ సేన ఓటమికి రాహుల్‌ను తప్పుపట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. నిజానికి భారత్ తక్కువ స్కోరుకే పరిమితం కావడం ప్రభావం చూపిందని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని పేర్కొన్నాడు.
గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో..
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆదివారం నాటి లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి... లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లా 9వ వికెట్ కోల్పోయాక గెలుపు సమీకరణం 63 బంతుల్లో 51 పరుగులుగా ఉన్న తరుణంలో.. చివరి వికెట్ కాబట్టి భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది.
అయితే బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ అపార పట్టుదల కనబర్చాడు. కీలక సమయంలో ముస్తఫిజుర్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో టీమిండియాపై బంగ్లా పైచేయి సాధించగలిగింది. తద్వారా తొలి వన్డేలో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.
రాహుల్ క్యాచ్ పట్టి ఉంటే...
ఇదిలా ఉంటే.. బంగ్లా మరో 32 పరుగులు చేయాల్సిన దశలో మెహదీ కొట్టిన షాట్ గాల్లోకి బాగా పైకి లేచింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ వెనక్కి పరుగెడుతూ దాదాపు డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ వరకు వెళ్లినా... క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు.
దీంతో రాహుల్ గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరేగా ఉండేందంటూ అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేశారు టీమిండియా అభిమానులు. అదే విధంగా భారత బౌలర్ల తీరును విమర్శించారు.
రాహుల్ తప్పేం లేదు.. తప్పంతా వాళ్లదే!
ఈ నేపథ్యంలో బంగ్లా చేతిలో భారత జట్టు ఓటమిపై దిగ్గజ ఆటగాడు సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మన బౌలర్లు అద్భుతంగా రాణించారు. 136 పరుగులకే 9 వికెట్లు కూల్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అలాంటి సమయంలో మిరాజ్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ అయింది. అదృష్టం వల్ల అతడు తప్పించుకోగలిగాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
నిజానికి భారత జట్టు మరో 70- 80 పరుగులు చేయాల్సింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి అదే ప్రధాన కారణం అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. క్యాచ్ వదిలేసిన కారణంగా రాహుల్‌ను తప్పు పట్టాల్సిన పనిలేదని, అలాగే బౌలర్లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చాడు.
బ్యాటర్లు మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అందరికంటే మెరుగైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్(73 పరుగులు) కీపింగ్‌లో ఒక తప్పుతో విమర్శలపాలు కావడం గమనార్హం.
చదవండి: మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ
Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన?
We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM
— Tanay Vasu (@tanayvasu) December 4, 2022