ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా 125/4 | IND Vs ENG 1st Test Match Day 2 Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND Vs ENG 1st Test Day 2: ముగిసిన రెండోరోజు ఆట.. టీమిండియా 125/4

Published Thu, Aug 5 2021 3:36 PM | Last Updated on Thu, Aug 5 2021 10:39 PM

IND Vs ENG 1st Test Match Day 2 Updates And Highlights - Sakshi

►  భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. వర్షం కార‌ణంగా రెండో రోజు మ్యాచ్‌ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆట ముగిసే సరికి భారత్‌ స్కోర్‌: 125/4 ఉంది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (57), పంత్‌ (7) ఉన్నారు.

► వర్షం కార‌ణంగా భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య రెండో రోజు మ్యాచ్ నిలిచిపోయింది. ఇప్పటికే వెలుతురు లేమితో రెండో సెష‌న్‌ తూడిచిపెట్టుకుపోగా.. మూడో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి భార‌త్ 46.2 ఓవ‌ర్ల‌కు 4 వికెట్ల న‌ష్టంతో 125 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 57 ప‌రుగులు ), రిష‌బ్ పంత్ ( 7 ప‌రుగులు) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 57 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది.

రహానే రనౌట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
► ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా 5 పరుగులు చేసిన అజింక్యా రహానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓలి రాబిన్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌ రెండో బంతిని కేఎల్‌ రాహుల్‌ ఢిపెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే  నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రహానే అప్పటికే క్రీజు వదిలి ముందుకు రావడంతో బంతిని అందుకున్న బెయిర్‌ స్టో నేరుగా త్రో విసిరాడు. దీంతో డైరెక్ట్‌ త్రోతో రహానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రాహుల్‌ 52, పంత్‌ 3 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. 

కోహ్లి గోల్డెన్‌ డక్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా 
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్‌ విరామం అనంతరం ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన టీమిండియాకు పుజారా రూపంలో షాక్‌ తగిలింది. 4 పరుగులు చేసిన పుజారా అండర్సన్‌ బౌలింగ్‌లో కీపర్‌ బెయిర్‌ స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. అండర్సన్‌ వేసిన బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. రాహుల్‌ 51, రహానే 0 క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ ఓలి రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో సామ్‌ కరన్‌కు క్యాచ్‌​ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్‌ లంచ్‌ విరామానికి వెళ్లింది. ప్రస్తుతం భారత్‌ 37.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

నిలకడగా ఆడుతున్న భారత్‌
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో రెండో రోజు ఆటను భారత్‌ నిలకడగా ఆరంభించింది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 12, రోహిత్‌ శర్మ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. భారత పేస్‌ బౌలర్లు తమ ప్రదర్శనతో దుమ్మురేపడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్‌ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మొహమ్మద్‌ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 9, కేఎల్‌ రాహుల్‌ 9 పరుగులతో ఆడుతున్నారు.

తొలిరోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన భారత్‌ బ్యాటింగ్‌లో రెండో రోజు మొత్తం నిలబడి ఆడితే భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. అంతకముందు బౌలింగ్‌ ధాటికి ఇంగ్లండ్‌ మొదటి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ జో రూట్‌ (108 బంతుల్లో 64; 11 ఫోర్లు) మాత్రమే పట్టుదల ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించగా, మిగతావారంతా విఫలమయ్యారు. జస్‌ప్రీత్‌ బుమ్రాకు 4 వికెట్లు దక్కగా... మొహమ్మద్‌ షమీ 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement