India vs England, 2nd Test- Sarfaraz vs Patidar: ‘‘ఎట్టకేలకు టీమిండియా సెలక్టర్ల నుంచి అతడికి పిలుపు వచ్చింది.. దేశవాళీ క్రికెట్‌లో, భారత్-ఏ తరఫున సత్తా చాటుతున్న ఈ ముంబై బ్యాటర్‌ను ఇన్నాళ్లకు బీసీసీఐ కరుణించింది..
ఇక భారత్ తరఫున అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడమే తరువాయి. ఇంతకీ రెండో టెస్టు తుదిజట్టులో అతడికి చోటు దక్కుతుందా?’’.. యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి క్రీడా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.
ఎట్టకేలకు పిలుపు
రంజీల్లో పరుగుల వరద పారించినా.. నోటి దురుసు కారణంగా సెలక్షన్ కమిటీ అతడి పేరును పరిశీలనలోకి తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఎట్టకేలకు అతడి ప్రతిభ వైపే మొగ్గు చూపిన సెలక్టర్లు ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఛాన్స్ అయితే ఇచ్చారు.
అంతకంటే ముందుగానే పాటిదార్
అయితే, అంతకంటే ముందే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిగా మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్‌కు జట్టులో చోటిచ్చారు. హైదరాబాద్ టెస్టు తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరం కాగా.. సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు సర్ఫరాజ్‌కు తలుపులు తెరిచారు.
కానీ విశాఖపట్నం టెస్టులో తుది జట్టులో అతడికి చోటిస్తారా లేదంటే పాటిదార్‌ను ఆడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ అంశం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు?
‘‘వాళ్లిద్దరూ సూపర్ ప్లేయర్లు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టంతో కూడుకున్న నిర్ణయం. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఎప్పుటికపుడు వారి ప్రదర్శనలు మేము గమనిస్తూనే ఉన్నాం. ఇక స్వదేశీ పిచ్‌ల మీద జట్టు ఆడేపుడు వాళ్లిద్దరి చేరిక మాకు అదనపు ప్రయోజనంగా మారుతుందనడంలో సందేహం లేదు.
వాళ్ల నిర్ణయాన్ని బట్టే
ముందు చెప్పినట్లుగానే ఇద్దరిలో ఒకరినే తీసుకోవాల్సి రావడం వల్ల కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నిర్ణయాలకు అనుగుణంగానే తుదిజట్టు ప్రకటన ఉంటుంది’’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు.
తొలి టెస్టులో ఓటమితో తామేమీ కుంగిపోలేదని.. రెండో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు కచ్చితంగా తిరిగి పుంజుకుంటారని ఈ సందర్భంగా రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఫిబ్రవరి 2 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య విశాఖపట్నంలో రెండో టెస్టు ఆరంభం కానుంది.
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్‌డేటెడ్):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.
చదవండి: Ind vs Eng: కోహ్లి వస్తే వేటు పడేది నీ మీదే సర్ఫరాజ్! తాడోపేడో తేల్చుకో..
Comments
Please login to add a commentAdd a comment