కొంపముంచిన జడ్డూ, అశూ.. టీమిండియాకు షాక్‌! రోహిత్‌ రియాక్షన్‌ | Ind Vs Eng 3rd Test Day 2: Why Team India Were Penalized 5 runs Controversy | Sakshi
Sakshi News home page

Ind Vs Eng: కొంపముంచిన జడ్డూ, అశూ.. టీమిండియాకు అంపైర్‌ షాక్! ఏకంగా..

Published Fri, Feb 16 2024 12:08 PM | Last Updated on Fri, Feb 16 2024 1:11 PM

Ind Vs Eng 3rd Test Day 2: Why Team India Were Penalized 5 runs Controversy - Sakshi

టీమిండియాకు అంపైర్‌ షాక్‌(PC: BCCI/sports18)

India vs England, 3rd Test Day 2: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత బ్యాటర్లు ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంగా అంపైర్‌ ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు.

కాగా రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య రెండో రోజు ఆట మొదలైంది. 326/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన భారత్‌ ఆదిలోనే కుల్దీప్‌ యాదవ్‌(4) రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధ్రువ్‌ జురెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆచితూచి ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్‌ 102వ ఓవర్లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ వేసిన బంతిని అశ్విన్‌ అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా షాట్‌ ఆడి.. పరుగు తీద్దామని భావించాడు.

ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు
అయితే, జురెల్‌ అతడిని వెనక్కి వెళ్లమని సైగ చేశాడు. ఇంతలో ఫీల్డ్‌ అంపైర్‌ టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ.. ఇంగ్లండ్‌కు 5 రన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అశ్విన్‌ పిచ్‌ మధ్య భాగం(ప్రొటెక్టడ్‌) గుండా పరిగెత్తేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం.

కారణం ఇదే
మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ రూల్స్‌ ప్రకారం.. ‘‘ఉద్దేశపూర్వకంగా లేదంటే అనుకోకుండానైనా సరే పిచ్‌ పాడయ్యేలా ఆటగాడు వ్యవహరించడం తప్పు. ప్రొటెక్టడ్‌ ఏరియాలోకి స్ట్రైకర్‌ గనుక ప్రవేశిస్తే వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి. పిచ్‌ డ్యామేజ్‌ అయ్యే పరిస్థితే గనుక వస్తే అంపైర్‌ వెంటనే జోక్యం చేసుకుని అతడు/ఆమెను కారణం చెప్పకుండానే బయటకు పంపే వీలు ఉంటుంది.

ఎంసీసీ నిబంధన 41.15 ప్రకారం.. తొలిసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడితే బ్యాటర్లను అంపైర్‌ హెచ్చరిస్తాడు. ఇదే మొదటి.. చివరి తప్పిదం కావాలి. ఇన్నింగ్స్‌ మొత్తానికి ఒక్కసారి మాత్రమే మినహాయింపు ఉంటుంది.

తొలుత జడ్డూ.. ఇప్పుడు అశూ
రెండోసారి కూడా ఇలాంటి చర్యకు పాల్పడితే పెనాల్టీ విధిస్తారు. కాగా టీమిండియా రాజ్‌కోట్‌ టెస్టులో ఇలాంటి చర్యకు పాల్పడటం ఇది రెండోసారి. మొదటిరోజు ఆటలో రవీంద్ర జడేజా కూడా ఇలాగే పిచ్‌ సురక్షిత భాగంలోకి వచ్చాడు. తాజాగా అశ్విన్‌ కూడా ఇదే తప్పు పునరావృతం చేయడంతో అంపైర్‌ 5 పరుగుల పెనాల్టీ విధించాడు.

ఫలితంగా ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 5/0తో మొదలుపెట్టనుంది. కాగా అంపైర్‌ తనను మధ్యలోనే వెళ్లిపొమ్మని చెప్పగా అశూ(37) అతడితో వాగ్వాదానికి దిగేందుకు సిద్ధం కాగా.. మరో ఎండ్‌లో ఉన్న ధ్రువ్‌ జురెల్‌ వచ్చి అతడిని సముదాయించాడు. ఇక ఇదంతా చూస్తున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. నిరాశగా చూస్తూ ఇచ్చిన రియాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది.

చదవండి: Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ! పాపం సర్ఫరాజ్‌.. రోహిత్‌ శర్మ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement