Ind Vs Eng: ఏంటిది గిల్‌? ఏం చేశావు?.. పాపం రోహిత్‌! | Ind vs Eng 3rd Test: Disappointed Rohit Looks Away As Gill Departs For Duck | Sakshi
Sakshi News home page

#Gill: మొన్న సెంచరీ.. ఇప్పుడు డకౌట్‌! ఏంటిది గిల్‌?

Published Thu, Feb 15 2024 2:09 PM | Last Updated on Thu, Feb 15 2024 3:24 PM

Ind vs Eng 3rd Test Rohit Disappointed Looks Away Gill Departs For Duck - Sakshi

రోహిత్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI/JIO Cinema)

టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ చేసిన పరుగులు 24, 0. ఫలితంగా బ్యాటింగ్‌ టెక్నిక్‌ సరిగా లేదంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.

అయితే, విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా తానేంటో నిరూపించుకున్నాడు గిల్‌. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని 104 విలువైన పరుగులు సాధించాడు.

తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టులోనూ శుబ్‌మన్‌ గిల్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడని భావిస్తే తుస్సుమనిపించాడు.

రాజ్‌కోట్‌ టెస్టులో 9 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ సంధించిన అద్భుతమైన డెలివరీని సరిగ్గా అంచనా వేయలేక వికెట్‌ సమర్పించుకున్నాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి 5.4 ఓవర్‌ వద్ద గిల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.

ఆ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. ‘‘ఏంటిది గిల్‌? ఏం చేశావు?’’ అన్నట్లుగా నిరాశగా గిల్‌ వైపు ఓ లుక్కిచ్చాడు. కాగా గిల్‌ కంటే ముందు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(10) మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌కు తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ గిల్‌ తనకు సహకరిస్తాడని భావిస్తే రోహిత్‌ శర్మకు నిరాశే మిగిలింది. అతి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించిన గిల్‌ ఇలా అవుట్‌ కావడంతో అభిమానులు సైతం అతడి ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement