IND VS NZ 1st ODI: Rohit Out For 34 Inspite Of Getting Good Start, Check Score Details - Sakshi
Sakshi News home page

IND VS NZ 1st ODI: కొనసాగుతున్న రోహిత్‌ వైఫల్యాల పరంపర.. శుభారంభం లభించినా..!

Published Wed, Jan 18 2023 3:07 PM | Last Updated on Wed, Jan 18 2023 4:18 PM

IND VS NZ 1st ODI: Rohit Out For 34, Inspite Of Getting Good Start - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతూ ఉంది. తాజాగా హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 38 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌.. 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక్కడ మనమొక విషయం గమనిస్తే.. ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్‌ బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ మంచి ఆరంభాలే లభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు.

గతవారం శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఇదే తంతు సాగింది. లంకపై తొలి వన్డేలో 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌, ఈ మ్యాచ్‌లో తప్పక సెంచరీ సాధిస్తాడని అంతా ఊహించినప్పటికీ ఆ మార్కును అందుకునేందుకు 17 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఆతర్వాత రెండో వన్డేలో 21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 17 పరుగులు చేసి నిరాశపరిచిన రోహిత్‌.. మూడో వన్డేలో (49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు) లభించిన శుభారంభాన్ని సైతం సద్వినియోగం చేసుకోలేకపోయాడు.  

అంతకుముందు బంగ్లాదేశ్‌ టూర్‌లో సైతం రోహిత్‌ ఇదే తరహా ప్రదర్శనను కనబర్చాడు. బం‍గ్లాతో తొలి వన్డేలో 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 27 పరుగులు చేసిన అతను.. రెండో వన్డేలో గాయపడినప్పటికీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి (28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో జట్టును గట్టెక్కించడంలో విఫలమయ్యాడు. 

ఇక అంతకుముందు టీ20 వరల్డ్‌కప్‌-2022లోనూ రోహిత్‌ వైఫల్యాల పరంపర కొనసాగింది. ఆ మెగా టోర్నీలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ (39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53) మినహాయించి టోర్నీ మొత్తం ఉసూరుమనిపించాడు. పాక్‌పై 4(7), సౌతాఫ్రికాపై 14 (17), బంగ్లాదేశ్‌పై 2 (8), జింబాబ్వేపై 15 (13), సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 27 (28).. ఇలా ఆ టోర్నీలో ప్రతి మ్యాచ్‌లో తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు.

2021 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌పై చివరిసారి సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్‌.. దాదాపు ఏడాదిన్నరగా ఆ మార్కును అందుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఆరంభాలు లభించినప్పటికీ వాటిని మూడంకెల స్కోర్‌గా మలచడంలో విఫలమయ్యాడు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌.. 21 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్‌తో పాటు విరాట్‌ కోహ్లి (8), ఇషాన్‌ కిషన్‌ (5) నిరాశపర్చగా.. శుభ్‌మన్‌ గిల్‌ (64 నాటౌట్‌) అర్ధసెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా సూర్యకుమార్‌ (6) బ్యాటింగ్‌ చేస్తున్నాడు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement