గ్లెన్‌ ఫిలిప్స్‌ మాయాజాలం: పంత్‌ బౌల్డ్‌.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా | Ind vs NZ 2nd Test Day 2: Pant Bowled By Glenn Phillips India In Trouble | Sakshi
Sakshi News home page

గ్లెన్‌ ఫిలిప్స్‌ మాయాజాలం: పంత్‌ బౌల్డ్‌.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

Published Fri, Oct 25 2024 11:18 AM | Last Updated on Fri, Oct 25 2024 11:37 AM

Ind vs NZ 2nd Test Day 2: Pant Bowled By Glenn Phillips India In Trouble

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. పుణె వేదికగా  రెండో రోజు ఆటలో భాగంగా శుక్రవారం 16-1 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన రోహిత్‌ సేనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కివీస్‌ బౌలర్‌ మిచెల్‌ సాంట్నర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొట్టాడు.

తొలుత కోహ్లి
భారత ఇన్నింగ్స్‌ 22వ ఓవర్‌ మూడో బంతికి శుబ్‌మన్‌ గిల్‌(30)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సాంట్నర్‌.. 24వ ఓవర్‌ నాలుగో బంతికి విరాట్‌ కోహ్లి(1)ని బౌల్డ్‌ చేశాడు. అయితే, సాంట్నర్‌ వేసిన లో ఫుల్‌టాస్‌ను ఆడలేక వికెట్‌ పారేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కు రిషభ్‌ పంత్‌ తోడయ్యాడు.

పంత్‌-  సర్ఫరాజ్‌ జోడీపై ఆశలు
వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతారని అభిమానులు భావించగా.. కాసేపటికే ఆ ఆశలపై గ్లెన్‌ ఫిలిప్స్‌ నీళ్లు చల్లాడు. ఈ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ 26వ ఓవర్‌ నాలుగో బంతికి జైస్వాల్‌(30)ను నాలుగో వికెట్‌గా వెనక్కి పంపాడు. 

ఈ క్రమంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రీజులోకి వచ్చాడు. దీంతో వీళ్లిద్దరు కలిసి బెంగళూరు టెస్టు తరహాలో భారీ భాగస్వామ్యం(నాలుగో వికెట్‌కు 177) నెలకొల్పుతారని అభిమానులు ఆశించారు.

 గ్లెన్‌ ఫిలిప్స్‌ మాయాజాలం
అయితే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మరోసారి స్పిన్‌ మంత్రం వేసి.. రిషభ్‌ పంత్‌ను బౌల్డ్‌ చేశాడు. 31వ ఓవర్‌ రెండో బంతికి 18 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద పంత్‌ నిష్క్రమించాడు. దీంతో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగింది. 

ఈసారి రంగంలోకి దిగిన సాంట్నర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ రూపంలో మరో కీలక వికెట్‌ పడగొట్టాడు. 34వ ఓవర్‌ ఆరో బంతికి సాంట్నర్‌ బౌలింఘ్‌ సర్ఫరాజ్‌ విలియం రూర్కీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా కేవలం 95 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. 

లంచ్‌@ 107/7
ఇక అశ్విన్‌(4) సాంట్నర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. 103 పరుగుల స్కోరు వద్ద భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు- 107/7 (38).  కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 152 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. ఓవరాల్‌గా రెండోసారి..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement