India tour of South Africa, 2023-24: సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత ‘జట్ల’పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. ప్రొటిస్ గడ్డపై వరుస సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో జట్టును సెలక్ట్ చేస్తుందని ముందే ఊహించానని పేర్కొన్నాడు.
అయితే, మూడు జట్లలోనూ ఓ కీలక ఆటగాడి పేరు మాత్రం మిస్ అయిందని.. అతడు ఉంటే జట్టు మరింత పటిష్టమయ్యేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు. కాగా డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.
మూడు ఫార్మాట్లకు మూడు జట్లు
ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే మూడు జట్లను ప్రకటించింది. రెగుల్యర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.
ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకులుగా వ్యవహరించనున్నారు. టెస్టు సిరీస్‌తో రోహిత్, కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా జియో సినిమా షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అందరికీ సంతోషమే.. ఆ ఒక్కడికి తప్ప
‘‘సౌతాఫ్రికా పర్యటన కోసం టీమిండియా సెలక్టర్లు మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేయడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. జట్టులో చోటు ఆశించిన చాలా మందికి సంతోషం దక్కింది. అయితే, ఈ టూర్ గురించి వినగానే నా మదిలో మెదిలిన పేరు భువనేశ్వర్ కుమార్.
సౌతాఫ్రికాకు వెళ్తున్నామంటే జట్టులో ఎక్కువగా ఫాస్ట్‌బౌలర్లు ఉండాలి. అయితే, కొత్త బంతితో ఫలితం రాబట్టగల అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ వంటి యువ బౌలర్ల రూపంలో మంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నమాట వాస్తవమే.
భువీ లాంటి అనుభవజ్ఞుడిని మర్చిపోకండి
కానీ భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్‌బౌలర్ జట్టులో ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సెలక్టర్లు అతడి పేరును పూర్తిగా విస్మరించడం తగదు. ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా సెలక్టర్లను ఉద్దేశించి మాట్లాడాడు.
దేశవాళీ టోర్నీలో అదరగొట్టినా
కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భువీ.. ఇప్పటి వరకు రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. స్థానిక లీగ్, దేశవాళీ మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ టీమిండియాలో చోటు కోసం యువ బౌలర్లతో పోటీలో మాత్రం వెనుకబడిపోయాడు. ఇటీవల ముగిసిన టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భువీ.. మొత్తంగా 16 వికెట్లు తీశాడు.
చదవండి: సౌతాఫ్రికా టూర్: వన్డేలకు రాహుల్ సారథి.. జట్ల వివరాలివే
చదవండి: WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్..
Comments
Please login to add a commentAdd a comment