
ఫైల్ ఫొటో
IND vs SA Test Series: టీమిండియా అదరగొడుతోంది.. కానీ ఇక్కడ మాదే పైచేయి: కవ్వించిన ప్రొటిస్ కెప్టెన్
IND vs SA Test Series- Dean Elgar Comments: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ సిరీస్‌కు సన్నద్ధం చేస్తున్నాడు. మరోవైపు.. స్వదేశంలో భారత్‌పై తమకున్న రికార్డులను ప్రస్తావిస్తూ ప్రొటిస్ మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ సైతం ఇదే పని చేశాడు. విదేశాల్లో టీమిండియా రికార్డు మెరుగుపడిందని చెబుతూనే.. సొంతగడ్డపై తమదే పైచేయి అని వ్యాఖ్యానించాడు.
అదే విధంగా... ఏడుసార్లు టీమిండియా తమ చేతిలో ఓడిపోయిందన్న విషయాన్ని గుర్తుచేసిన ఎల్గర్... ఈ సిరీస్‌లో తామే ఫేవరెట్ జట్టు అని చెప్పుకొచ్చాడు. స్వదేశంలో ఆడటం తమకు సానుకూల అంశమని.. భారత జట్టు తమను ఓడించడం అసాధ్యమని పేర్కొన్నాడు. ‘‘విదేశాల్లో టీమిండియా అదరగొడుతోంది. కానీ ఇక్కడ మాత్రం మాదే పైచేయి’’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు. అయితే... ఎల్గర్ చెప్పినట్లు ప్రొటిస్ జట్టుకు సొంత దేశంలో ఆడటం కలిసివస్తుందేమో గానీ.. భారత్‌పై తప్ప వారికి ఇతర దేశాలపై మరీ అంత మెరుగైన రికార్డు లేకపోవడం గమనార్హం. కాగా డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది.
స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టు వైఫల్యాలు
►ఇటీవలి మూడు సిరీస్‌లలో ఒక్కటి మాత్రమే ప్రొటిస్ జట్టు గెలిచింది.
►2019లో శ్రీలంక చేతిలో దక్షిణాఫ్రికా 2-0తేడాతో ఓటమి పాలైంది.
►ఇంగ్లండ్ అయితే ఏకంగా 4-1 తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది.
►ఇక 2017 నుంచి ఇప్పటి వరకు స్వదేశంలో 23 మ్యాచ్‌లు ఆడిన ప్రొటిస్ జట్టు 16 గెలిచింది. ఏడింటిలో ఓటమిపాలైంది.
చదవండి: SA vs IND: ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికు నో ఛాన్స్!