కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. తొలి వన్డేను టైగా ముగించిన శ్రీలంక.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలి వన్డేలో ఏ విధంగా అయితే స్పిన్ వలలో చిక్కుకుని భారత్ విల్లవిల్లాడందో. సేమ్ టూ సేమ్ రెండో వన్డేలో కూడా అంతే. 241 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రోహిత్ శర్మ మెరుపులతో 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.
దీంతో లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా చేధిస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13 ఓవర్‌లో రోహిత్ శర్మను ఔట్ చేసి వికెట్ల వేట మొదలు పెట్టిన వాండర్సే.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శివమ్ దూబేలను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు.
జెఫ్రీ ఓంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓవరాల్‌గా 6 వికెట్ల పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వాండర్సే.. తన 10 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. ఈ నేపథ్యంలో ఎవరీ వాండర్సే అని నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు.
ఎవరీ వాండర్సే...?
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనుహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని వాండర్సే అందిపుచ్చుకున్నాడు. కాగా 34 ఏళ్ల వాండర్సే 2015లో న్యూజిలాండ్‌పై శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో వాండర్సే కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆ తర్వాత అతడి వన్డేల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. తన 9 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు అతడు ఆడింది కేవలం 22 వన్డేలు మాత్రమే. అయితే లిస్ట్-ఎ క్రికెట్‌లో మాత్రం వాండర్సేకు అపారమైన అనుభవం ఉంది. 102 మ్యాచ్‌ల లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 3560 పరుగులతో పాటు 150 వికెట్లు పడగొట్టాడు.
దేశీవాళీ క్రికెట్‌లో మూర్స్ ఎసీ, సీదువ రద్దోలువ సీసీ క్లబ్స్‌కు వాండర్సే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక వాండర్సే ఇప్పటివరకు ఓవరాల్‌గా 37 మ్యాచ్‌ల్లో శ్రీలంక తరపున ఆడాడు. అందులో 22 వన్డేలు, 14 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఉన్నాయి.
అదే విధంగా వాండర్సే తన కెరీర్‌లో ఓ వివాదంలో కూడా చిక్కుకున్నాడు. 2018 వెస్టిండీస్ పర్యటనలో శ్రీలంక క్రికెట్ నిబంధనలను ఉల్లఘించినందుకు వాండర్సే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా వార్షిక కాంట్రాక్ట్ ఫీజులో 20% జరిమానా కూడా శ్రీలంక క్రికెట్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment