Ind Vs WI 3rd ODI Ishan Kishan And Shubman Break Dhawan-Rahane Elite Record - Sakshi
Sakshi News home page

Ishan-Shubman Partnership Record: వెటరన్‌ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్‌- గిల్‌! అంతేకాదు.. దాదా- వీరూల తర్వాత..

Published Thu, Aug 3 2023 3:38 PM | Last Updated on Thu, Aug 3 2023 4:35 PM

Ind Vs WI 3rd ODI Ishan Kishan Shubman Break Dhawan Rahane Elite Record - Sakshi

West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్‌పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా... తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్‌ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది. ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకున్న జట్టు ఇప్పుడు టి20 పోరుకు సిద్ధమైంది.

హాఫ్‌ సెంచరీలతో మెరిసి
ఇక్కడా సీనియర్లు లేకపోవడంతో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువ ఆటగాళ్లకు ఇది సరైన అవకాశం.   ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకాలతో మెరిసిన విషయం తెలిసిందే. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు రాబట్టగా.. గిల్‌ 92 బంతుల్లో 11 బౌండరీలు బాది మొత్తంగా 85 రన్స్‌ చేశాడు.

వెటరన్‌ జోడీ రికార్డు బద్దలు
మొదటి వికెట్‌కు 19.4 ఓవర్లలో వీరిద్దరు కలిసి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్‌ క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌- అజింక్య రహానే పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా 2017లో ఈ జోడీ వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో మొదటి వికెట్‌కు 132 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత వీరి రికార్డును లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ ఓపెనింగ్‌ పెయిర్‌ బ్రేక్‌ చేసి కొత్త చరిత్ర సృష్టించింది.

దాదా- వీరూల తర్వాత
అదే విధంగా.. కరేబియన్‌ దీవిలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యం(ఏ వికెట్‌పై అయినా) నమోదు చేసిన రెండో భారత జోడీగా నిలిచింది. 2007 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ సందర్భంగా బెర్ముడాపై సౌరవ్‌ గంగూలీ- వీరేంద్ర సెహ్వాగ్‌ రెండో వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరి తర్వాతి స్థానాన్ని ఇషాన్‌- గిల్‌ ఆక్రమించారు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలం
కాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2–1 తేడాతో భారత్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో భారత్‌ 200 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. 352 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. 

ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా
గుడకేశ్‌ మోటీ (34 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, అలిక్‌ అతనజ్‌ (50 బంతుల్లో 32; 3 ఫోర్లు), అల్జారి జోసెఫ్‌ (39 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్దిగా పోరాడగలిగారు. శార్దుల్‌ ఠాకూర్‌ వన్డేల్లో తన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన (4/37) నమోదు చేయగా, ముకేశ్‌ 3, కుల్దీప్‌ 2 వికెట్లు తీశారు. శుబ్‌మన్‌ గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచారు. 

శార్దూల్‌ చెలరేగాడు
2007 నుంచి ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 13వ వన్డే సిరీస్‌ విజయం కావడం విశేషం.  పదునైన బౌలింగ్‌తో చెలరేగిన పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి కింగ్‌ (0), మేయర్స్‌ (4), హోప్‌ (5) అవుట్‌ కావడంతో స్కోరు 17/3 వద్ద నిలిచింది. 

పదేళ్ల తర్వాత ఉనాద్కట్‌
ఆ తర్వాత విండీస్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పదేళ్ల తర్వాత తొలి వన్డే ఆడిన ఉనాద్కట్‌... కార్టీ (6)ని అవుట్‌ చేయగా... తన వరుస ఓవర్లలో శార్దుల్‌ రెండు వికెట్లు తీయడంతో స్కోరు 50/6కు చేరింది. అనంతరం తన వరుస ఓవర్లలో కుల్దీప్‌ తర్వాతి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మోతీ, జోసెఫ్‌ కొద్ది సేపు పట్టుదల కనబర్చి తొమ్మిదో వికెట్‌కు 60 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని విడదీసిన శార్దుల్‌ తన తర్వాతి ఓవర్లో ఆఖరి వికెట్‌ కూడా తీసి విండీస్‌ ఆట ముగించాడు.   

చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌
అరుదైన రికార్డుకు చేరువలో శాంసన్‌.. కోహ్లి, రోహిత్‌ సరసన చేరేందుకు! 
కోహ్లితో పాటు ప్రపంచకప్‌ గెలిచి.. ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్‌ నుంచి ఇప్పుడిలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement